July 15, 2026

జస్ట్ 2.30 గంటలే.. హైదరాబాద్‌ టూ విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. ఇక దూసుకెళ్లడమే

జస్ట్ 2.30 గంటలే.. హైదరాబాద్‌ టూ విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. ఇక దూసుకెళ్లడమే
Reading Time: < 1 minute
జస్ట్ 2.30 గంటలే.. హైదరాబాద్‌ టూ విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. ఇక దూసుకెళ్లడమే

హైదరాబాద్‌ నుంచి విజయవాడ మధ్య రాకపోకలు సాగించే తెలుగు ప్రజలకు ఇదో సూపర్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్‌ నుండి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఏర్పాటుకు సన్నహాలు జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ కీలక ప్రాజెక్టు విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ – అమరావతి – బందరు పోర్టు వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని.. ఈ హైవే నిర్మాణం జరిగితే హైదరాబాద్ – విజయవాడ మధ్య సుమారు 100 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని.. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలను మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు.

ముఖ్యంగా హైదరాబాద్‌ నుండి బందరు పోర్టుకు సరుకు రవాణా వేగవంతం అవుతుందని.. తద్వారా ఎగుమతులు, దిగుమతుల ప్రక్రియ కూడా ఈజీ అవుతుందన్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీలైనంత త్వరగా అనుమతులు జారీ చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్‌లో రాబోయే రీజనల్ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదం, దక్షిణ భాగానికి అనుమతులు జారీ చేయాలని కోరారు.

అలాగే మన్ననూరు – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సాయం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటవీ శాఖ నుంచి రావాల్సిన అనుమతులను త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ – మంచిర్యాల మధ్య ఆరు లేన్ల జాతీయ రహదారి మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ సైతం తామే చేస్తామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.