July 14, 2026

IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
Reading Time: 2 minutes
Imd Heavy Rain Alert 14 States South India Heatwave Humidity Weather

కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. ఎల్‌నినో కారణంగా దేశంలో వర్షాలు కరవయ్యాయి. ఇలాంటి తరుణంలో ఐఎండీ గుడ్‌న్యూస్ చెప్పింది. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు దక్షిణ, తీర ప్రాంత రాష్ట్రాల్లో మాత్రం రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది.

భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు తూర్పు, ఈశాన్య భారతంపై చురుకుగా కొనసాగుతున్నాయి. దీంతో వచ్చే వారం రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా ఒడిశా, జార్ఖండ్, బీహార్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.

త్రిపురలో జూలై 16 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీటిమునిగే పరిస్థితులు, స్థానికంగా వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అగర్తల సహా పలు ప్రాంతాల్లో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయని తెలిపింది. జూలై 15, 16 తేదీల్లో వర్షాల తీవ్రత కొంత తగ్గినా.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఖోవాయ్, వెస్ట్ త్రిపుర, సెపాహిజాలా, గోమతి, సౌత్ త్రిపుర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

అసోంలో కూడా వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూలై 15 నుంచి వర్షాలు మరింత ఉద్ధృతం కానున్నాయని, ఉరుములు, మెరుపులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు లేదా బలహీన నిర్మాణాల కింద ఆశ్రయం తీసుకోవద్దని ప్రజలకు సూచించింది.

ఇక ఉత్తరాఖండ్‌లో జూలై 15 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వారాంతానికి జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. ఉత్తరప్రదేశ్ తూర్పు జిల్లాల్లో జూలై 17 నుంచి 19 వరకు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జూలై 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

దక్షిణ భారతంలో ఉక్కపోత

మరోవైపు దక్షిణ భారత రాష్ట్రాల్లో మాత్రం వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగనుంది. తీర ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉక్కపోత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తీర ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇదిలా ఉండగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడం, పొడి వాతావరణం కొనసాగడం, సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ పంటలకు నష్టం జరగకుండా మూడు దశల అత్యవసర కార్యాచరణ ప్రణాళికలో తొలి దశను అమలు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మొత్తంగా తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరోవైపు దక్షిణ భారతంలో ఉక్కపోత కొనసాగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.