July 14, 2026

Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి

Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
Reading Time: < 1 minute
Shiv Charan Reddy Apology Viral Audio Controversy Telangana Youth Congress

Shiv Charan Reddy: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివాదాస్పద ఆడియోల వ్యవహారంపై తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడిన శివచరణ్ రెడ్డి, తనపై కావాలనే దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.

ఈశ్వరమ్మను తాను ఎక్కడా కించపరచలేదని, ఆమె తనకు నాన్నమ్మలాంటి వారని పేర్కొన్నారు. అలాగే ఏ కులాన్ని అవమానించేలా తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. కుల సంఘాల నాయకులకు ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా తనను సంప్రదించి వివరణ కోరాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు వాస్తవం కాదని, కట్, కాపీ, పేస్ట్ చేసి వాటిని కావాలనే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొందరు ఏఐ సాయంతో నకిలీ ఆడియోలను సృష్టించి తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలోని కొందరు నాయకులు కూడా కుట్ర చేస్తున్నారని శివచరణ్ రెడ్డి ఆరోపించారు.

జనవరిలో జరిగిన ఒక వివాదాన్ని ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా బయటకు తీసుకొచ్చారని అన్నారు. తన కమిటీలో యాదవులు, గౌడలు సహా బీసీ వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారని, తమ కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని చెప్పారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, శివచరణ్ రెడ్డిపై పీసీసీ చీఫ్, పార్టీ ఇన్‌చార్జికి ఫిర్యాదు చేసిన ఈశ్వరమ్మ మాత్రం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శివచరణ్ రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ, ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె పట్టుబడుతున్నారు.