Health tips: కంప్యూటర్/ఫోన్ చూసి చూసి కళ్లు అలసిపోతున్నాయా? ఇలా మీ కళ్లని రిలాక్స్ చేయండి !

కంప్యూటర్లు, మొబైల్ స్క్రీన్ల ముందు గంటల తరబడి గడపడం ఈ రోజుల్లో అందరికీ అలవాటైపోయింది. దీనివల్ల స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ (నీలి కాంతి) ప్రభావంతో కళ్లు తొందరగా అలసిపోయి, డ్రైగా (పొడిగా) మారిపోతుంటాయి. ఈ కంటి అలసటను తగ్గించుకుని, కళ్లకు హాయినిచ్చే కొన్ని అద్భుతమైన యోగా చిట్కాలను యోగా నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
కంటి అలసటను తగ్గించే సింపుల్ చిట్కాలు
కనుగుడ్ల వ్యాయామం: రోజంతా ఒకే చోట చూడటం వల్ల కంటి కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే, మీ కనుగుడ్లను కుడివైపునకు, ఎడమవైపునకు పదిసార్లు తిప్పాలి. అలాగే పైకి, కిందికి మరో పదిసార్లు తిప్పడం వల్ల కంటి కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
కనురెప్పలు ఆర్పడం : కంప్యూటర్ స్క్రీన్లను చూసేటప్పుడు మనం కనురెప్పలు ఆర్పడం మర్చిపోతుంటాం. అలా కాకుండా, వెంటవెంటనే పదిసార్లు కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కంటిలోని సహజమైన నీరు, మ్యూకస్ (తేమ) కళ్లంతా సమానంగా వ్యాపించి, పొడిబారడం తగ్గి అలసట మాయమవుతుంది.
కళ్లపై సున్నితమైన ఒత్తిడి : కళ్లు బాగా అలసిపోయినట్లు అనిపిస్తే.. మీ రెండు చేతులను ఒకదానికొకటి బాగా రుద్ది ఆ వెచ్చదనాన్ని కళ్లపై ఉంచాలి లేదా చేతివేళ్లతో కళ్లపై చాలా నెమ్మదిగా, కాసేపు ఒత్తిపట్టాలి. ఇది కంటి కండరాల మీద ఉన్న ఒత్తిడిని తగ్గించి కళ్లను రిలాక్స్ చేస్తుంది.
ALSO READ : మీ ఇద్దరి మధ్య గొడవలా ? భార్యాభర్తలకి ఆ తెలివి ఉండాల్సిందే..
సాధన (Focusing): ఏదైనా ఒక వస్తువు వైపు కన్నార్పకుండా నిలకడగా చూడటాన్ని ‘త్రాటకం’ అంటారు. సాయంత్రం వేళ సూర్యాస్తమయాన్ని లేదా వెలిగించిన క్యాండిల్/ దీపం జ్వాలను రెప్ప వేయకుండా కాసేపు చూడాలి. ఈ సాధన వల్ల కంటి కండరాలు బలంగా మారడమే కాకుండా, కంటిచూపు కూడా మెరుగుపడుతుంది.
రోజూ మీ బిజీ షెడ్యూల్‌లో కేవలం ఐదు నిమిషాలు ఈ చిట్కాల కోసం కేటాయిస్తే మీ కళ్లు ఎల్లప్పుడూ తాజాగా, ఆరోగ్యంగా ఉంటాయి!