AI వాడుతున్న కంపెనీలకు సత్య నాదెళ్ల కీలక హెచ్చరిక.. హిడెన్ సీక్రెట్ వెల్లడి

AIని ఉపయోగిస్తున్న కంపెనీలకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక సూచనలు చేశారు. ఏఐ కోసం కంపెనీలు డబ్బు మాత్రమే ఖర్చు చేయడం లేదని, తెలియకుండానే తమ అత్యంత విలువైన సంస్థాగత జ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయని హెచ్చరించారు.
AI కోసం కంపెనీలు రెండుసార్లు చెల్లిస్తున్నాయంటూ తన వ్యక్తిగత బ్లాగ్‌లో నాదెళ్ల పేర్కొన్నారు. ఒకసారి డబ్బుతో, మరోసారి తమ సొంత వ్యాపార పరిజ్ఞానంతో అని వెల్లడించారు. AI నుంచి మెరుగైన ఫలితాలు పొందాలంటే కంపెనీలు తమ వ్యాపార రహస్యాలు, పని విధానాలు, అంతర్గత సమాచారం, అనుభవాన్ని మోడళ్లకు అందించాల్సి వస్తోందని అసలు విషయం బయటపెట్టారు. దీంతో చాలా కంపెనీలు తమ గుట్టు తమకు తెలియకుండానే ఇవ్వాల్సి వస్తోందని అన్నారు.
నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త కెన్నెత్ ఆరో ప్రతిపాదించిన “Information Paradox”ను ప్రస్తావించిన నాదెళ్ల.. ఏఐ యుగంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. గతంలో కొనుగోలుదారుడు సమాచారం విలువ తెలుసుకోవడానికి దానిని పొందాల్సి వచ్చేదని, ఇప్పుడు మాత్రం AIను ఉపయోగించాలంటే కంపెనీలే తమ విలువైన జ్ఞానాన్ని ముందుగా పంచుకోవాల్సి వస్తోందన్నారు నాదెళ్ల.
ఉద్యోగులు AIకు ఇచ్చే ప్రతి ప్రాంప్ట్, తప్పులను సరిదిద్దేందుకు ఇచ్చే ప్రతి ఫీడ్‌బ్యాక్, సంస్థలో రూపొందించే ప్రతి వర్క్‌ఫ్లో కంపెనీకి చెందిన విలువైన ఆస్తిగా మారుతుందని నాదెళ్ల తెలిపారు. ఇవే కాలక్రమంలో సంస్థకు పోటీదారులపై ఆధిక్యాన్ని కల్పించే అంశాలుగా మారతాయని చెప్పారు. అందుకే ఈ సమాచారాన్ని తెలియకుండానే ఇతర AI మోడళ్ల అభివృద్ధికి ఉపయోగించే పరిస్థితి రాకూడదని సూచించారు.
ALSO READ : OpenAIపై Apple సంచలన కేసు..
కంపెనీలు తమ “లెర్నింగ్ లూప్”పై పూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉండాలని నాదెళ్ల సూచించారు. అంటే AIతో జరిగిన సంభాషణలు, ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్, మూల్యాంకనాలు, సంస్థలో ఏర్పడిన పరిజ్ఞానం అన్నీ కంపెనీ నియంత్రణలోనే ఉండాలని అన్నారు. వినియోగదారుల స్పష్టమైన అనుమతి లేకుండా ఈ సమాచారాన్ని బయటి AI మోడళ్ల అభివృద్ధికి ఉపయోగించకుండా ఉండే కొత్త “ట్రస్ట్ బౌండరీ” అవసరమని పేర్కొన్నారు.
అలాగే ఒకే AI సంస్థపై పూర్తిగా ఆధారపడకుండా, అవసరానికి అనుగుణంగా వేర్వేరు AI మోడళ్లను ఉపయోగించగల వ్యవస్థను కంపెనీలు రూపొందించుకోవాలని నాదెళ్ల సూచించారు. ఇలా చేయడం వల్ల డేటాపై పూర్తి నియంత్రణ ఉండటమే కాకుండా, ఖర్చులు తగ్గడంతో పాటు ఒకే సంస్థపై ఆధారపడే పరిస్థితి కూడా నివారించవచ్చని సూచించారు. మొత్తానికి ఏఐ యుగంలో అసలు పోటీ కేవలం అత్యాధునిక మోడళ్ల నిర్మాణంలో కాదని, AIని ఉపయోగించే సమయంలో ఏర్పడే విలువైన సంస్థాగత జ్ఞానాన్ని ఎవరు సురక్షితంగా కాపాడుకుంటారనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సత్య నాదెళ్ల స్పష్టం చేశారు.