కొంత బెటర్ : ఎండలు తగ్గుతాయి.. అక్కడక్కడ వర్షాలు

తెలంగాణలో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కొంత ఉపశమనాన్ని కలిగించే వార్త చెప్పింది. ఏమీ లేకపోవడం కంటే ఏదో ఒకటి జరగడం మేలు కదా అన్నట్లుగా ఎట్టకేలకు రాష్ట్రంలో వాతావరణం మారబోతోంది.
ఇవాళ జూలై 14న తెలంగాణ అంతటా వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుంది. హైదరాబాద్ నగరంతో సహా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వేడి, ఉక్కపోత కొనసాగుతాయి. అయితే, జూలై 15 బుధవారం నుంచి వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులు రానున్నాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రుతుపవనాల విరామ ప్రభావం, అంటే బ్రేక్ మాన్‌సూన్ ఎఫెక్ట్ రేపటి నుంచి కొంత తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల జూలై 15 నుండి పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు మొదలవుతాయి.
ఇక జూలై 16 నుంచి 19 మధ్య రాష్ట్రంలో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ, అటు హైదరాబాద్ నగరంలోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అయితే ఇవి రాష్ట్రవ్యాప్తంగా కురిసే విస్తృతమైన భారీ వర్షాలు కావు. అయినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న తీవ్రమైన వేడి, పొడి వాతావరణం నుండి ఈ వర్షాలు ఖచ్చితంగా ప్రజలకు కొంత ఉపశమనాన్ని, చల్లదనాన్ని కలిగిస్తాయి.