అమెరికా స్టోర్ ఇండియన్స్ రచ్చ.. మునక్కాయల కోసం ఎగబడ్డ జనం..

అమెరికా న్యూజెర్సీలో కొత్తగా ఓపెన్ చేసిన ఒక ఇండియన్ గ్రోసరీ (కిరాణా) స్టోర్ దగ్గర జరిగిన తోపులాట ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్ల మధ్య పెద్ద చర్చకే దారితీసింది. గత వారం న్యూజెర్సీలోని ‘పిస్కాటవే’ అనే ఏరియాలో కొత్తగా ‘పటేల్ బ్రదర్స్’ ఇండియన్ కిరాణా స్టోర్ ప్రారంభించారు. ఓపెనింగ్ ఆఫర్లు, తక్కువ ధరల కారణంగా వందల మంది జనాలు ఒకేసారి స్టోర్‌పై ఎగబడ్డారు. దాంతో అక్కడ తీవ్ర తోపులాట, గందరగోళం నెలకొంది.
ముఖ్యంగా, మార్కెట్లో డిమాండ్ ఉన్న ములక్కాయలను కేవలం $1.99కే (రూ.189) అమ్ముతున్నారని తెలిసి, జనాలు ఎగబడి వాటిని కొనేందుకు ఒకరినొకరు తోసుకుంటూ, నెట్టుకుంటూ కనిపించారు. ఈ తొపులాట వీడియోలు ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అయ్యాయి.
నెటిజన్ల రియాక్షన్
ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు అక్కడి జనాల ప్రవర్తనను తీవ్రంగా తప్పుబడుతుంటే, మరికొందరు మాత్రం వారిని సపోర్ట్ చేస్తున్నారు.
న్యూజెర్సీలోనే ఉంటున్న ఎన్నారై మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ… “ఇది చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంది. ధరలు పెరిగిన మాట నిజమే, కానీ ఆఫర్ల కోసం ఇలా ప్రవర్తించడం పద్ధతి కాదు. నా కుటుంబం ఎప్పుడూ ఇలా చేయదు” అని కామెంట్ చేసింది.
మరికొందరైతే… “ఇండియాకు వెళ్ళినప్పుడు పెద్ద ధనవంతుల్లా బిల్డప్ ఇచ్చేది వీళ్లే, ఇక్కడేమో ఇలా ఆఫర్ల కోసం కొట్టుకుంటున్నారు” అంటూ ఎద్దేవా చేశారు.
“అమెరికాలో ‘బ్లాక్ ఫ్రైడే’ సేల్స్ అప్పుడు తెల్లవాళ్ళు మాల్స్‌లో ఇంతకంటే ఘోరంగా కొట్టుకుంటారు కదా ! కేవలం ఇక్కడ ఉన్నవాళ్లు భారతీయులు అయినంత మాత్రాన ఇంతలా ట్రోల్ చేస్తారా?” అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇది జనాల తప్పు కాదని, స్టోర్ మేనేజ్‌మెంట్ సరైన సెక్యూరిటీ, రూల్స్ పెట్టకపోవడం వల్లే ఇలాంటి గందరగోళం జరిగిందని మరికొందరు అభిప్రాయపడ్డారు.