Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..

Dowry harassment: ఢిల్లీలో పెళ్లైన రెండు నెలలకే నవవధువు ఆకృతి అనుమానాస్పదంగా మరణించింది. 28 ఏళ్ల ఆకృతి సుతార్ జూలై 4న లోధీ కాలనీలోని పాలికా కుంజ్ అపార్ట్‌మెంట్ వద్ద భవనం పై నుంచి కిందపడిన స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఎయిమ్స్‌కు తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.అయితే, ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె భర్త అరస్తూ సిక్కాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు అతడిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఛతర్‌పూర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఆకృతి, తన చిన్ననాటి స్నేహితురాలి సోదరుడైన అరస్తు సిక్కాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ప్రేమ వివాహమైనా చివరకు వరకట్న వేధింపులు తప్పలేదు.
ఆకృతి తల్లి అను సాయ్ సుతార్ ఫిర్యాదులో కీలక ఆరోపణలు చేశారు. తన కుమార్తెను భర్తతో పాటు ఆమె అత్తమామలు వివాహం జరిగినప్పటి నుంచి వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండాలని, త్వరగా గర్భం దాల్చాలని ఒత్తిడి తెచ్చినట్లు చెప్పింది. వివాహానికి ముందు ఉద్యోగం కొనసాగించడానికి అంగీకరించినప్పటికీ, పెళ్లి తర్వాత మాట మార్చినట్లు వెల్లడించింది. ఆకృతిని భర్త బెల్ట్‌తో కొట్టినట్లు తనకు చెప్పిందని తల్లి ఆరోపించారు. జూన్ 29న అతను నన్ను చంపేస్తాడని చెబుతూ ఫోన్ చేసినట్లు వెల్లడించింది. అదే రోజు భోజనం వేడిగా లేదని మరోసారి దాడి చేసినట్లు ఆకృతి తల్లి ఆరోపించింది. జూలై 4 ఉదయం ఆఫీస్‌కు వెళ్లే ముందు చివరిసారిగా ఫోన్ చేసిందని, రాత్రికి ఆమె మృతి చెందినట్లు సమాచారం అందిందని తల్లి చెప్పింది.
ఆకృతి పెళ్లికి రూ. 7-8 లక్షలు ఖర్చు చేశామని, అయినప్పటికీ భర్త కుటుంబం రూ. 20 లక్షల కట్నం డిమాండ్ చేసిందని ఆరోపించారు. ఆకృతి మానసికంగా ఎంతో ధైర్యవంతురాలని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని, ప్లాన్ ప్రకారం అత్తింటి వారు ఆకృతిని హత్య చేసినట్లు అను సాయ్ సుతార్ ఆరోపించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఈ కేసును సమగ్రంగా విచారిస్తున్నారు.