Reading Time: 2 minutes
Mammootty Gets Help From Local Man After Losing Way In Tamil Nadu

Mammootty: మలయాళ సూపర్‌స్టార్ హీరో మమ్ముట్టీకి తమిళనాడులో ఓ సాధారణ వ్యక్తి చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్ పూర్తి చేసుకుని కేరళకు తిరుగు ప్రయాణమైన సమయంలో మమ్ముట్టీ ప్రయాణిస్తున్న కారు దారి తప్పినట్లు సమాచారం. హైవే మూసివేత కారణంగా కారు మరో మార్గంలోకి వెళ్లడంతో సరైన దారి తెలియక ఇబ్బంది ఎదురైంది. ఈ సమయంలో శివగంగై జిల్లా తిరుపత్తూర్‌కు చెందిన పాండియన్ అనే వ్యక్తి మమ్ముట్టీకి సాయం చేశారు. మమ్ముట్టీ ప్రయాణిస్తున్న మార్గం కరెక్ట్‌గా లేదని గుర్తించిన ఆయన.. తన బైక్‌పై దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్లు వెళ్లేందుకు సరైన దారి చూపించారు. దీంతో మమ్ముట్టీ సురక్షితంగా కేరళ వైపు వెళ్లే మార్గాన్ని పట్టుకోగలిగారు.

ఈ సందర్భంగా మమ్ముట్టీ.. పాండియన్‌ను కలిసి ఆయన చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, పాండియన్‌ను ఆప్యాయంగా ‘నమ్మ ఫ్రెండు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. మమ్ముట్టీ తనకు ధన్యవాదాలు చెప్పడంతో పాండియన్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల మమ్ముట్టీ తమిళనాడులోని కారైకుడిలో తన సినిమా షూటింగ్‌ని ముగించుకొని కేరళకు తిరిగి వెళ్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాండియన్ సూపర్‌స్టార్ మమ్ముట్టీకి సాయం చేశారు.