Reading Time: 2 minutes
House Tips: వర్షాకాలంలో ఇల్లు నిర్మించుకుంటున్నారా..? ఈ చిన్న పొరపాట్లు చేస్తే డబ్బులు వృథా అయినట్లే..

సొంతిల్లు అనేది ప్రతీఒక్కరి కల. సామాన్య, మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కాయాకష్టం చేస్తూ ఉంటారు. కూడబెట్టుకున్న డబ్బుతో పాటు బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకుని ఇల్లు నిర్మించుకుంటారు. ఇల్లు నిర్మించుకునే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నాణ్యమైన వస్తువులను ఉపయోగించుకోవడంతో పాటు కన్‌స్ట్రక్షన్ విషయంలో పొరపాట్లు చేయకుండా అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలంలో ఇంటి నిర్మాణం జరుగుతుంటే మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వర్షాల సమయంలో పునాదులు బలహీనడపటం, గోడల్లో తేమ ఏర్పడటం, పగుళ్లు రావడం వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. దీని వల్ల ఖర్చులు మరింత పెరగడంతో పాటు అనేక సమస్యలు తలెత్తవచ్చు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇల్లు మన్నికగా ఉండాలంటే వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పునాది బలంగా ఉండాలి. పునాదుల వద్ద వర్షపు నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువకాలం పాటు నీరు నిలిచి ఉంటే నేల బలహీపనడే అవకాశం ఉంటుంది. ఇక పిల్లర్లలో కూడా ఎక్కువ రోజులు వర్షపు నీరు నిలిచి ఉంటే బలహీనపడవచ్చు. ఇక వర్షాకాలంలో సిమెంట్ బస్తాలను నేలపై ఉండచకూడదు. సిమెంట్‌కు వాటర్ తగిలితే వెంటనే గడ్డలు కడితే ఉపయోగించుకోవడానికి పనికిరాదు. దీని వల్ల సిమెంట్ వృధా అవుతుంది. దీంతో సిమెంట్‌ను భద్రంగా ఉండే ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. ఒక బల్ల ఏర్పాటు చేసుకుని దానిపై సిమెంట్ బస్తాలను పెట్టడం మంచిది. ఇక స్టీల్, కంకరపై టార్పాలిన్లను కప్పాలి. పెద్ద వర్షం వస్తే కొట్టుకుపోయే అవకాశం ఉంటుది గనుక హైక్వాలిటీ టార్పాలిన్ కవర్లను ఉపయోగించాలి.

ఇటుకల విషయంలో జాగ్రత్త

ఇక ఇటుకలు వర్షంలో తడిస్తే బలాన్ని కోల్పోతాయి. దీంతో వాటిని ఉపయోగించేముందు నాణ్యతను పరిశీలించాలి. వర్షాకాలంలో గోడలు తేమగా ఉంటాయి. ఈ కారణంతో గోడలకు ప్లాస్టరింగ్ చేయకూడదు. ప్లాస్టరింగ్ చేయడం వల్ల బుడగలు, పగుళ్లు లాంటివి రావొచ్చు. దీంతో గోడలు పూర్తిగా ఆరిన తర్వాతే పనులు మొదలుపెట్టాలి. అలాగే వర్షాల సమయంలో స్లాబ్, కాంక్రీట్ పనులు చేయకూడదు. వర్షం సమయంలో కాంక్రీట్‌లో నీటి శాతం పెరిగితే బలం తగ్గుతుంది. వర్షాల సమయంలో ఇంట్లో కరెంట్ వైరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే షార్ట్ సర్క్యూట్, కరెంట్ షాక్ వంటి ప్రమాదం పొంచి ఉంది.  దీని వల్ల వాటర్ ప్రూఫ్ టేప్ వాడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంటిని లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి నిర్మించుకుంటూ ఉంటారు. కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే డబ్బులు వృథా అయి ఖర్చులు పెరుగుతాయి. దీంతో వర్షాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.