
ఇంటర్నెట్‌లో ఏదైనా అందమైన వస్తువు వైరల్ కావడానికి పెద్దగా సమయం పట్టడం లేదు. కొంతకాలం క్రితం లబుబు బొమ్మలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ స్థానంలో ‘స్క్విషీ డంప్లింగ్స్’ వచ్చాయి. చూడటానికి ఆవిరితో ఉడికించిన డంప్లింగ్‌లా ఉంటాయి.
లబుబు తర్వాత ఇప్పుడు స్క్విషీ డంప్లింగ్స్
చిన్న డంప్లింగ్ ఆకారంలో ఉండే ఈ బొమ్మల్లో జెల్ లాంటి పదార్థం ఉంటుంది. చేతిలోకి తీసుకుని నొక్కితే మెత్తగా కుంచించుకుపోతాయి. మళ్లీ మామూలు ఆకారంలోకి వస్తాయి. చూడటానికి ముద్దుగా ఉండటం, చేతితో నొక్కినప్పుడు కలిగే అనుభూతి.. రెండూ కలిసి వీటిని పిల్లలకే కాదు, పెద్దలకూ ఆకర్షణీయంగా మార్చాయి. చిన్న వెదురు స్టీమర్ బాక్స్‌లా కనిపించే ప్యాక్‌లో వీటిని విక్రయిస్తున్నారు.
లోపల ఏ రంగు డంప్లింగ్ ఉంటుందో కొనేవారికి ముందుగా తెలియదు. పింక్, బ్లూ, మెరుపులతో కూడిన అరుదైన మోడళ్ల వంటి రకాలు ఉండటంతో, బాక్స్ తెరిచే ఉత్కంఠ కూడా ఈ ట్రెండ్‌కు మరో కారణంగా మారింది. అరుదైన రంగు వస్తుందా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ ఉంటుంది. దీంతో ఒక బొమ్మ కొనడం కంటే.. మరో బాక్స్ తెరిచి చూడాలనే కోరిక పెరుగుతోంది. ఇదే లబుబు ట్రెండ్‌లోనూ కనిపించింది.
కానీ ఇక్కడే అసలు సమస్య
చూడటానికి ముద్దుగా ఉన్న ఈ బొమ్మల విషయంలోనే ఇప్పుడు భద్రతా హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా నకిలీ డంప్లింగ్స్ మార్కెట్లోకి రావడం సమస్యగా మారింది. యూకేలో ఉత్పత్తి భద్రతా అధికారులు, స్థానిక సంస్థలు కొన్ని నకిలీ బొమ్మలపై హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని నకిలీ ఉత్పత్తుల నుంచి పెట్రోల్‌ను పోలిన తీవ్రమైన రసాయన వాసన వస్తున్నట్లు గుర్తించారు. కొన్ని నమూనాల్లో స్టైరిన్, జైలీన్ వంటి ప్రమాదకర రసాయనాలపై కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
►ALSO READ | నాగపంచమి వేళ పాములను హింసిస్తే జైలు శిక్ష..
సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు ఈ బొమ్మలను ఫ్రీజర్‌లో పెట్టడం లేదా మైక్రోవేవ్‌లో వేడి చేయడం చూపిస్తున్నాయి. అలా చేయడం ప్రమాదకరం. బొమ్మ పగిలితే లోపలున్న జెల్ బయటకు వచ్చి వేడిగా మారి చర్మ సమస్యలకు కారణం కావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. బొమ్మ చిరిగినా, పగిలినా, జెల్ బయటకు వచ్చినా వెంటనే పారేయాలని సూచిస్తున్నారు.
అసలుదా.. నకిలీదా?
అసలైన స్క్విషీ డంప్లింగ్స్‌ను ఆర్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ ‘క్రేజీ ఫన్’ బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. తెలియని ఆన్‌లైన్ విక్రేతల దగ్గర చాలా తక్కువ ధరకు దొరికే బొమ్మల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. తీవ్రమైన రసాయనాల వాసన రావడం, తయారీదారు వివరాలు లేకపోవడం, భద్రతా గుర్తులు కనిపించకపోవడం, నాసిరకం ప్యాకేజింగ్, అసాధారణంగా తక్కువ ధర వంటి అంశాలు నకిలీ ఉత్పత్తికి సంకేతాలుగా ఉండొచ్చు.
భారత్‌లోనూ ట్రెండ్ మొదలైంది
ఆన్‌లైన్ వేదికల్లో వివిధ రకాల స్క్విషీ డంప్లింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే భారత్‌లో ఇప్పటివరకు వీటిపై పెద్ద స్థాయిలో అధికారిక భద్రతా హెచ్చరికలు వెలువడినట్లు సమాచారం లేదు. అయినప్పటికీ నకిలీ బొమ్మల సమస్యను దృష్టిలో పెట్టుకుని కొనేటప్పుడు తయారీదారు, భద్రతా వివరాలు వంటి అంశాలను పరిశీలించడం అవసరం.