
Dimaagi Naxals: ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట పై నుంచి ‘‘దిమాగీ నక్సల్స్’’ అనే వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్షాల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ‘‘దిమాగీ నక్సల్స్’’ అంటే ఎవరో చెబుతూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం వ్యంగ్యంగా స్పందిస్తూ.. తాను ‘దిమాగీ నక్సల్స్’’గా ఉండటానికి గర్విస్తున్నారని అన్నారు.
రిజిజు ప్రకారం, “దిమాగీ నక్సల్స్” అంటే.. మావోయిస్టులకు మద్దతు ఇస్తూ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించే వారు, వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చేవారు, ఆర్టికల్ 370కు మద్దతు ఇచ్చేవారు, దేశ ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశం నుంచి వేరు చేయడానికి “చికెన్ నెక్”ను తెంచాలని కోరుకునేవారు అని అన్నారు. ఇప్పుడు దిమాగీ నక్సల్స్ అనే పదంపై సీపీఎం, కాక్రోచ్ జనతా పార్టీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తుున్నారు.
శనివారం ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశిస్తూ ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ.. అడవుల్లో ఆయుధాలు పట్టుకుని పోరాడిన నక్సలైట్లను దాదాపుగా అంతం చేశామని చెప్పారు. అయితే మావోయిస్టు భావజాలంతో ఉన్న “దిమాగీ నక్సల్స్”(నక్సల్ భావజాలం) ఇంకా అవకాశాల కోసం చూస్తున్నారని, హింస, అశాంతికి దారి తీసే ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలంటే అలాంటి వారిని గుర్తించి ఏకాకులు చేయాలని మోడీ అన్నారు.