Reading Time: 2 minutes
Smart Glasses: మీకు తెలియకుండా మిమ్మల్ని రహస్యంగా రికార్డ్ చేస్తాయి.. ఈ సన్‌ గ్లాసెస్‌తో జాగ్రత్త..

మెటా విడుదల చేసిన ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. అనుమతి లేకుండా చుట్టపక్కల ఉన్నవారిని రికార్డ్ చేసేగలిగే ఫీచర్‌పై ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. కళ్లద్దాల తయారీ సంస్థ ఎస్సిలార్‌లక్సోటికాతో కలిసి మెటా వీటిని అభివృద్ధి చేసిసింది. రేబాన్ మెటా బ్రాండ్‌తో ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే సాధారణంగా కనిపించే కళ్లద్దాల్లో కెమెరాలు, మైక్రోఫోన్లు, ఏఐ ఫీచర్లను మెటా జోడించింది. దీంతో చేతులు ఉపయోగించకుండానే ఫోటోలు, వీడియోలు తీయగలిగే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉండగా.. కంటెంట్ క్రియేటర్స్ వల్ల ఇవి బాగా పాపులర్ అయ్యాయి. వీటిని ఒక వ్యక్తి ధస్తే.. వారి చుట్టూ ఉన్న వ్యక్తుల అనుమతి లేకుండా ఇది సులభంగా రికార్డ్ చేస్తుంది.

స్మార్ట్ గ్లాసెస్‌పై ఆందోళనలు

ప్రాంక్‌లు లేదా అవాంఛిత సంభాషణల సమయంలో వీటిని ధరించినవారు అపరిచితులను చిత్రీకరిస్తున్న వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ఎదుటివారు అనుమతి లేకుండా వారి దృశ్యాలను చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజలను రహస్యంగా రికార్డ్ చేయడం, వేధించడం లేదా వీడియోల కోసం వారిని దోపిడీ చేయడం లాంటివి జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు వంటి సున్నితమైన ప్రదేశాలలో ఈ స్మార్ట్ గ్లాసెస్ వాడకంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై మెటా స్పందించింది. తన గోప్యతా చర్యలను సమర్థించుకుంది. వినియోగదారుడి గ్యాలరీ కోసం ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేస్తున్నప్పుడు తమ కళ్లద్దాలలో ఉండే తెల్లటి క్యాప్చర్ LED మెరుస్తుందని తెలిపింది. కొత్త మోడళ్లలో LEDని కప్పివేసినా కెమెరా ఆటోమేటిక్‌గా నిలిచిపోతుందంటూ చెప్పుకొచ్చింది. రికార్డింగ్ సమయంలో కూడా క్యాప్చర్ LED యాక్టివ్‌గా ఉంటుందని, ఫిజికల్ బటన్లు లేదా వాయిస్ కమాండ్‌ల ద్వారా రికార్డింగ్‌ను నియంత్రించవచ్చని మెటా స్పష్టం చేసింది. ఈ క్రమంలో జర్మనీకి చెందిన హేట్‌ఎయిడ్.. మెటాతో పాటు ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ తయారీలో పాలుపంచుకున్న కంపెనీలపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. ఈ కళ్లద్దాలు రహస్య రికార్డింగ్‌కు వీలు కల్పిస్తున్నాయని ఆరోపించింది. జర్మన్ అధికారులు ప్రాథమిక సమీక్ష నిర్వహిస్తున్నారు.

అయితే ప్రజలను రహస్యంగా రికార్డ్ చేయడం, వేధించడం లేదా వీడియోల కోసం వారిని దోపిడీ చేయడం వంటి వాటికి సంబంధించిన కంటెంట్‌ను  తమ ప్లాట్‌ఫారమ్ తొలగిస్తుందని ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోస్సెరి తెలిపారు. అటువంటి కంటెంట్‌కు బాధ్యత వహించే ఖాతాలు కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ గ్లాసెస్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. మెటా మాత్రం సమర్థించుకుంటూ వస్తోంది. దీంతో ఏం జరుగుతుందనేది చూడాలి.