Reading Time: 2 minutes

Director Raja Sen: షూటింగ్ సెట్‌లో ప్రమాదం.. వెంటిలేటర్‌పై 3 నేషనల్ అవార్డ్స్ డైరెక్టర్..!

Caption of Image.

మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ బెంగాలీ దర్శకుడు రాజా సేన్ (70) తీవ్ర అనారోగ్యంతో కోల్‌కతాలోని SSKM ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనను అత్యవసర విభాగంలో నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. దిగ్గజ డైరెక్టర్ రాజా సేన్ ఆరోగ్యం విషమించిన వార్తతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు బెంగాలీ సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.

గాయం ఎప్పుడు మొదలైంది..

సినిమా ‘మాయా మృదంగ’ (2016) షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో రాజా సేన్ వెన్నుముకకు తీవ్ర గాయమైంది. అప్పట్లో పెద్ద సమస్యగా భావించని ఆ గాయం, కాలక్రమేణా ఆయన నడక సామర్థ్యాన్ని దెబ్బతీసిందని సన్నిహితులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన శరీర కింది భాగంలో బలహీనతను ఎదుర్కొన్నారు. పరీక్షల అనంతరం అది సంక్లిష్టమైన నాడీ సంబంధిత (న్యూరోలాజికల్) సమస్యగా తేలడంతో, ఫిబ్రవరిలో ఆయనకు సర్జరీ జరిగింది. ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ, ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.

జాతీయ అవార్డులతో గుర్తింపు..

1955లో కోల్‌కతాలో జన్మించిన రాజా సేన్, బెంగాలీ చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు. ఆయన తెరకెక్కించిన ‘దాము’, ‘అత్మియో సాజన్’, ‘ల్యాబొరేటరీ’, ‘దేబీపక్ష’, ‘కృష్ణకాంతర్ విల్’ వంటి చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. 1993లో రూపొందించిన ‘సుచిత్ర మిత్ర’ డాక్యుమెంటరీకి ఉత్తమ ఆర్ట్స్ & కల్చరల్ ఫిల్మ్ విభాగంలో జాతీయ పురస్కారం అందుకోగా, 1997లో దర్శకత్వం వహించిన ‘దాము’ చిత్రానికి ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు, అలాగే, ‘ఆత్మీయ స్వజన్’ (1999) వంటి చిత్రాలకు గానూ రాజా సేన్ మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులలో, బెంగాలీ సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.

©️ VIL Media Pvt Ltd.