
Sarfaraz Khan Training: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టులో చోటు దక్కకపోయినా దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ మాత్రం అస్సలు నిరాశ చెందలేదు. ఎప్పటిలానే తన సాధనను కంటిన్యూ చేశాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం (ఆగష్టు 15) ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజున టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రాక్టీస్ చేశాడు. లంచ్, టీ బ్రేక్‌లను కూడా వదలకుండా సర్ఫరాజ్ తన ఆటను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకున్నాడు. ఒకవేళ ప్లేయింగ్ 11లో ఛాన్స్ వస్తే.. తనను తాను సిద్ధంగా ఉంచుకోవాలనే పట్టుదలతో సర్ఫరాజ్ ఇలా ప్రాక్టీస్ చేశాడు.
మ్యాచ్ చూడకుండా.. ప్రాక్టీస్:
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయినప్పటికీ.. దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ జట్టును ముందుకు నడిపించారు. టీ విరామ సమయానికి భారత్ 197/1తో బలమైన స్థితిలో నిలిచింది. ఇదే సమయంలో సర్ఫరాజ్ ఖాన్ మాత్రం మ్యాచ్‌ను ప్రేక్షకుడిలా చూడకుండా తన శిక్షణలో నిమగ్నమయ్యాడు. లంచ్ విరామంలో నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. వర్షం అంతరాయం కలిగించే వరకు అతడు బ్యాటింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. అనంతరం టీ బ్రేక్‌లో ఫీల్డింగ్ సాధన చేశాడు. ముఖ్యంగా క్యాచ్‌లను పట్టడంపై దృష్టి పెట్టాడు. ఈ విషయాన్ని రేవ్‌స్పోర్ట్స్‌కు చెందిన సుభాయన్ చక్రవర్తి సోషల్ మీడియాలో వెల్లడించారు.
విరామాలను కూడా వదలకుండా ప్రాక్టీస్:
జట్టులో చోటు లేకపోయినా మ్యాచ్ మధ్య విరామాలను కూడా వదలకుండా ప్రాక్టీస్ చేయడం సర్ఫరాజ్ ఖాన్ కమిట్‌మెంట్‌ను చూపిస్తోంది. తుది జట్టులో అవకాశం ఎప్పుడు వచ్చినా.. సిద్ధంగా ఉండేందుకు అతడు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. సాయి సుదర్శన్ గాయం కారణంగా శ్రీలంక టెస్టు సిరీస్‌కు దూరం కావడంతో.. సర్ఫరాజ్ తిరిగి భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. అయితే ఆలస్యంగా జట్టులో చేరడంతో వార్మప్ మ్యాచ్‌లో ఆడే అవకాశం అతడికి రాలేదు. దీంతో తొలి టెస్టులోనూ అతడు తుది జట్టుకు దూరమయ్యాడు.
ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేక దృష్టి:
గత కొంతకాలంగా సర్ఫరాజ్ ఖాన్ తన ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాడు. గత ఏడాదిలో సుమారు 17 కిలోల బరువు తగ్గాడు. అంతర్జాతీయ జట్టులో తిరిగి స్థానం సంపాదించేందుకు ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడమే కాకుండా.. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. సర్ఫరాజ్‌కు చోటు దక్కకపోయినా.. నంబర్-3లో వచ్చిన దేవదత్ పడిక్కల్ మాత్రం తన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ 32 పరుగులకే రనౌట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన పడిక్కల్.. కేఎల్ రాహుల్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పడిక్కల్ తన కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. 134 బంతుల్లో శతకం పూర్తి చేసి నంబర్-3 స్థానంలో భారత జట్టుకు చాలా కాలంగా ఉన్న సెంచరీ కొరతకు తెరదించాడు. చివరిసారిగా శుభ్‌మన్ గిల్ 2024 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌పై చెన్నైలో నంబర్-3లో సెంచరీ చేశాడు.
2024లో న్యూజిలాండ్‌పై చివరి టెస్ట్:
సర్ఫరాజ్ ఖాన్ చివరిసారిగా 2024లో న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో భారత్ తరఫున టెస్టు ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాదాపు 19 నెలల తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్.. ఇప్పుడు మరో అవకాశం కోసం ఎదురు చూడాల్సి ఉంది. భారత్ తరఫున ఇప్పటివరకు ఆరు టెస్టులు ఆడిన సర్ఫరాజ్.. 371 పరుగులు చేశాడు. అతడి సగటు 37.10గా ఉండగా.. ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. గాలే టెస్టులో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోయినా సర్ఫరాజ్ ఖాన్ మాత్రం నిరుత్సాహపడకుండా తన సాధనను కొనసాగించడం విశేషం.