
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ వేశారు. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీకి… ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాతే భారత్‌లో మంచి కాలేజీలు లేవని గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మంచి పాఠశాలలు, కాలేజీలను ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఎందుకు వచ్చింది. యూనివర్శిటీల్లో ఖాళీ పోస్టులను ఎందుకు పెండింగ్ పెట్టారు. మీ హయాంలో ఎన్ని పేపర్ లీక్ లు జరిగాయని కేటీఆర్ సమాధానం చెప్పాలి. కాలేజీలకు నిధులు ఇవ్వకుండా ఎందుకు ఎండగట్టారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూడా సకాలంలో ఎందుకు చెల్లించలేకపోయారు.అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉద్యమాల్లో పాల్గొన్న యూనివర్సిటీ విద్యార్థులకు కనీస గౌరవం అయినా ఇచ్చారా.? అని కేటీఆర్ కు ప్రశ్నలు సంధించారు బండి సంజయ్.
శ్రీలంకను చూసి అది భారత్ కంటే గొప్పదని రావణాసురుడే అనగలడు. కానీ, రామ భక్తులు ఎప్పటికీ తమ మాతృభూమిని ఇంతటి చిన్నచూపుతో మాట్లాడరు. మీకు భారతదేశంలో అధికారం, ఇక్కడి ప్రజాధనంపై నియంత్రణ కావాలి. కానీ దేశాన్ని ప్రశంసించే విషయానికి వచ్చేసరికి అకస్మాత్తుగా ప్రతీదీ వేరే దేశమే మెరుగ్గా కనిపిస్తుంది. దండయాత్ర చేసే వారి మనస్తత్వం తన దుస్తులను మార్చుకోవచ్చేమో, కానీ భారత్ పట్ల ఉండే చిన్నచూపు మాత్రం అలాగే ఉంది.
ఒకవైపు కాంగ్రెస్ వందేమాతరం ఆపవేయాలని కోరుతుంది, మన ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అని అంటుంది. మరోవైపు బీఆర్ఎస్ భారతదేశంలో మంచి కాలేజీలు లేవని, ఇతర దేశాలు భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయని అంటుంది.మరి అలాంటి వారు… నేను నా చెమటను కండువాతో తుడుచుకున్నానని నా దేశభక్తిని ప్రశ్నిస్తారా? నేను నా చివరి శ్వాస వరకు కాషాయ జెండాను, త్రివర్ణ పతాకాన్ని గర్వంతో ధరిస్తాను. ఈ దేశం నా చెమటను చూసింది. ఒకవేళ భారత్‌కు ఎప్పుడైనా అవసరమైతే, నా రక్తాన్ని కూడా ఇస్తాను. నన్ను వెయ్యి సార్లు ప్రశ్నించండి. జీవితాంతం భారత్ మాతా కీ జై అని నినదించిన ఒక కార్యకర్తకు భారత్ అంటే ఏమిటో మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని బండి సంజయ్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.