Reading Time: 2 minutes
Viral Video: సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..! ఆ భయానక దృశ్యం చూస్తే..

సముద్ర జీవులతో జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పుడు ఎలాంటి ముప్పు ఎదురవుతుందో చెప్పడం కష్టం. తాజాగా ఫిలిప్పీన్స్‌లో ఓ జాలరికి అలాంటి విచిత్రమైన, అత్యంత భయాందోళన కలిగించే సంఘటన ఎదురైంది. సముద్రంలో వేటకు వెళ్లిన సదరు జాలరి ముఖాన్ని ఒక ఆక్టోపస్ గట్టిగా పట్టుకుని, ఎంతకీ వదలకుండా తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియోను వైరల్ ప్రెస్ ఇన్స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన తర్వాత ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

సమాచారం ప్రకారం.. జేసర్ సర్వెంటిస్ అనే మత్స్యకారుడు తన చిన్న పడవలో సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతని వలకు ఒక ఆక్టోపస్ చిక్కింది. దానిని సాధారణంగా నీటి నుంచి బయటకు తీస్తుండగా, ఆ ఆక్టోపస్ ఒక్కసారిగా అతనిపై తిరగబడింది. ఊహించని రీతిలో అది జాలరి ముఖం, తల భాగంపైకి పాకి, తన పొడవైన బాహువులతో అతని ముఖాన్ని గట్టిగా చుట్టేసింది.

ఆక్టోపస్ దాడితో ఆ జాలరి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ జీవి తన సక్కర్స్ అనేవి జిగట లాంటి కప్పుల సహాయంతో జాలరి చర్మానికి గట్టిగా అతుక్కుపోయింది. ఆక్టోపస్ బాహువులు అతని నోరు, ముక్కును కూడా కప్పేయడంతో కొద్దిసేపటి వరకు అతనికి సరిగా శ్వాస ఆడలేదు. తన ముఖం నుంచి దానిని వేరు చేయడానికి జాలరి తీవ్రంగా శ్రమించాడు. కానీ, ఆ ఆక్టోపస్ పట్టు ఏమాత్రం సడలలేదు.

చేతులతో ఎంత ప్రయత్నించినా ఆక్టోపస్ ఊడరాకపోవడంతో, ఆ జాలరి యుక్తిగా వ్యవహరించాడు. పడవలో ఉన్న ఒక వెదురు కర్ర ముక్కను తీసుకుని, దాని సాయంతో ఆక్టోపస్‌ను తన ముఖం నుంచి నెమ్మదిగా ఊడబెరికే ప్రయత్నం చేశాడు. కొంతసేపు ప్రాణాపాయ స్థితిలో పోరాడిన తర్వాత, ఆక్టోపస్ పట్టు సడలింది. వెంటనే దానిని పట్టుకుని సముద్రంలోకి విసిరేయడంతో జాలరి ఊపిరి పీల్చుకున్నాడు.

వీడియో ఇక్కడ చూడండి..

ఆక్టోపస్ పట్టు అంత బలంగా ఎందుకు ఉంటుంది?:

సముద్రపు అత్యంత తెలివైన జీవుల్లో ఆక్టోపస్ ఒకటి. దీని బాహువులపై వందలాది చిన్న చిన్న సక్కర్స్ ఉంటాయి. ఇవి ఏదైనా ఉపరితలానికి తాకినప్పుడు వాక్యూమ్ తరహా పట్టును సాధిస్తాయి. అందుకే ఇది పట్టుకుంటే తొలగించడం చాలా కష్టం. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జాలరి ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..