Reading Time: 2 minutes

ఆసీస్ ఓటమితో భారత్‌కు కొత్త టెన్షన్.. WTCలో బంగ్లా గెలుపు ఎఫెక్ట్!

Caption of Image.

Bangladesh vs Australia: డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సాధించిన చారిత్రాత్మక విజయం కేవలం కంగారూల జట్టును మాత్రమే కాకుండా, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) రేసులో భారత జట్టు ఆశలను సైతం తీవ్రంగా దెబ్బతీసింది. ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బంగ్లా.. తమ పాయింట్ల శాతాన్ని (PCT) 58.33 నుంచి ఏకంగా 66.67కి పెంచుకుంది. ఈ విజయంతో బంగ్లాదేశ్ పట్టికలో 4వ స్థానానికి దూసుకెళ్లగా, న్యూజిలాండ్ 72.22 శాతంతో మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా 75.00 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.

మరింత కష్టతరమైన భారత్ జర్నీ: 

బంగ్లాదేశ్ దూకుడుతో పాయింట్ల పట్టికలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం టీమిండియా 48.15 పాయింట్ల శాతంతో ఆరో స్థానానికి పరిమితమైంది. టాప్–2లోకి దూసుకెళ్లి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలనుకుంటున్న భారత్‌కు.. ఇప్పుడు గతంలో కంటే చాలా ఎక్కువ జట్లు పోటీలో ఉండటంతో మార్గం చాలా కఠినంగా మారింది. ఆస్ట్రేలియా పాయింట్ల శాతం 87.50 నుంచి 77.77కి తగ్గినప్పటికీ, భారత్ కంటే ముందు చాలా బలమైన జట్లు రేసులో ఉన్నాయి. ఇకపై ఇండియాకు ఎలాంటి పొరపాట్లకు తావులేదు. ప్రతి మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధిస్తేనే టీమిండియా ఫైనల్ రేసులో నిలబడగలుగుతుంది.

►ALSO READ | గాంధీ జయంతి నాడే వన్డే వరల్డ్ కప్ షురూ.. 2027పై ఐసీసీ మాస్టర్ ప్లాన్!

అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి చరిత్ర సృష్టించిన టైగర్స్: 

మార్రారా ఓవల్ వేదికగా జరిగిన ఈ తొలి టెస్టులో నజ్ముల్ హొస్సేన్ శాంటో నేతృత్వంలోని బంగ్లాదేశ్ జట్టు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించడం చరిత్రలోనే ఇదే మొదటిసారి. 23 ఏళ్లలో ఆసీస్ గడ్డపై ఆడిన మూడో టెస్టులోనే ఈ అద్భుతం సాధ్యమైంది. టూర్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీఏ ఎలెవన్ చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయి, కేవలం 54 పరుగులకే కుప్పకూలిన బంగ్లా జట్టు.. ఎవరూ ఊహించని విధంగా అగ్రశ్రేణి ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించి టెస్టు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకుంది.

©️ VIL Media Pvt Ltd.