Reading Time: < 1 minute
High Tension In Tadipatri Jc Prabhakar Reddy Ysrcp Leaders Clash At Wedding

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక టీడీపీ నాయకుడు సంజీవరెడ్డి కుమారుడి వివాహ వేడుక తాడిపత్రిలోని ఎస్ ఆర్ టీ ఫంక్షన్ హాల్‌ లో వైభవంగా జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పెళ్లి వేడుకకు పలువురు కీలక నాయకులు హాజరయ్యారు.

అయితే.. పెళ్లి వేడుకకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ సంజీవరెడ్డి సోదరుడు శ్రీరామ్‌ రెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని ప్రశ్నిస్తూ, ఆయనను వెంటనే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై అక్కడే ఉన్న తాడిపత్రి వైఎస్సార్సీపీ నాయకుడు కందిగోపుల మురళి తీవ్రంగా స్పందించారు. “మేమెందుకు బయటకు వెళ్లాలి?” అని ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా అదే ఫంక్షన్ హాల్‌ లో ఉన్నారు. మంత్రి సమక్షంలోనే నేతల మధ్య మాటల ఈటెలు విసురుకోవడం, వాగ్వాదం జరగడం తీవ్ర కలకలం రేపింది. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోయిన కాసేపటికే ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడమే కాకుండా, గుర్తుతెలియని వ్యక్తులు ఓ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పెళ్లికి వచ్చిన వేడుక ప్రతినిధులు, స్థానికులు తీవ్ర తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాడిపత్రిలో రాజకీయ విభేదాలు మళ్లీ భగ్గుమనడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.