Reading Time: < 1 minute
Dimaagi Naxal Label Targets Jantar Mantar Protesters Says Cpim Chief Ma Baby

CPIM: ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఉపయోగించిన “దిమాగీ నక్సల్” పదంపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఈ పదాన్ని ఉపయోగించడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ స్పందించారు. ఈ పదాన్ని ప్రభుత్వాన్ని విమర్శించే వారిని, జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టే వారిని ఉద్దేశించి చేశారని ఆయన అన్నారు. గతంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లను విమర్శించే వారిని ‘అర్బన్ నక్సల్స్’గా ముద్ర వేశారని, ఇప్పుడు ఇదే తరహాలో ‘దిమాగీ నక్సల్స్’ అనే కొత్త పదాన్ని తీసుకువచ్చారని బేబీ అన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ మాట్లాడుతూ, ‘దిమాగీ నక్సల్స్’ అనే పదాన్ని వాడారు. డవుల్లో ఆయుధాలు పట్టుకున్న నక్సలిజం దాదాపు అంతమయ్యే దశలో ఉన్నప్పటికీ, “దిమాగీ నక్సల్” భావజాలం ఉన్నవారు హింస, అశాంతికి అవకాశాల కోసం చూస్తున్నారని అన్నారు. ఇలాంటి మావోయిస్టు భావజాలం ఉన్న వారిని గుర్తించి, ఏకాకుల్ని చేయాలని పిలుపునిచ్చారు.

మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నక్సలిజాన్ని అంతం చేశామని చెబుతున్న విధానంపై బేబీ ప్రశ్నలు లేవనెత్తారు. యువకులు, యువతను పట్టుకుని న్యాయప్రక్రియ ముందు నిలబెట్టే బదులుగా ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదమని అభివర్ణించారు. వామపక్షాలు నక్సలిజాన్ని ఎప్పుడూ సమర్థించలేదని బేబీ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, దిమాగీ నక్సల్స్ ఇప్పుడు రాజకీయ రచ్చకు దారి తీసింది. ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యపై కాంగ్రెస్, సీపీఐ, సమాజ్‌వాదీ తదితర ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. మోదీ గతంలో తన రాజకీయ ప్రత్యర్థులను “అర్బన్ నక్సల్స్” అని పిలిచారని, ఇప్పుడు “దిమాగీ నక్సల్స్” అంటున్నారని విమర్శించారు. ఇది ప్రధాని నిరాశకు సంకేతమని అన్నారు.