Reading Time: < 1 minute
Gt Vs Rr What Happens If Gujarat Titans Vs Rajasthan Royals Qualifier 2 Gets Washed Out In Ipl 2026

GT vs RR: ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి ఫైనలిస్ట్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటికే ఫైనల్‌ లోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలాల్సి ఉంది. దీని కోసం నేడు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు క్వాలిఫయర్-2లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌లో ఆర్సీబీని ఢీకొంటుంది.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి క్వాలిఫయర్-2కు చేరుకుంది. మరోవైపు లీగ్ దశలో అద్భుతంగా ఆడిన గుజరాత్ టైటాన్స్, క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడంతో గుజరాత్‌కు మరో అవకాశం లభించింది.

గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ నేడు న్యూచండీగఢ్‌ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుండగా, టాస్ 7 గంటలకు పడనుంది. ఈ కీలక పోరుకు వర్షం ప్రభావం ఉంటుందా అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ అంచనాల ప్రకారం మ్యాచ్‌ కు పెద్దగా వర్ష ముప్పు కనిపించడం లేదు. న్యూచండీగఢ్‌లో భారీ ఎండలు ఉండే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ కోసం బీసీసీఐ రిజర్వ్ డే ఏర్పాటు చేయలేదు. అంటే మ్యాచ్ అదే రోజు పూర్తి కాకపోతే మరుసటి రోజు నిర్వహించే అవకాశం ఉండదు. అయితే మ్యాచ్ పూర్తిచేయడానికి అదనంగా 120 నిమిషాల సమయం కేటాయించారు. ఒకవేళ భారీ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దైతే, లీగ్ దశలో మెరుగైన స్థానం సాధించిన జట్టుకే ఫైనల్ బెర్త్ దక్కుతుంది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ముగించింది. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే మాత్రం గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రాజస్థాన్ కు మాత్రం తప్పనిసరిగా మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి.