Reading Time: < 1 minute

ఆందోళన వద్దు.. వారం రోజుల్లో వడ్ల కొనుగోళ్లు పూర్తి: మంత్రి వివేక్ వెంకట స్వామి

Caption of Image.

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని రాబోయే వారం రోజుల్లోగా పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. స్థానిక వ్యవసాయ సముదాయ గిడ్డంగి గోదాముల్లో స్థలం సరిపోకపోతే.. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలోని కొన్ని ప్రైవేట్ గోదాములను లీజుకు తీసుకున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమని భరోసా ఇచ్చారు.

గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి వివేక్ వెల్లడించారు. జూన్ 15వ తేదీ వరకు కొనుగోలు చేయాల్సిన మొత్తాన్ని.. ఈరోజు అంటే మే 27 నాటికే లక్షా 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించామన్నారు. ఈసారి 15 రోజుల ముందే పంట చేతికి రావడం, దిగుబడి కూడా భారీగా పెరగడంతో.. హమాలీలు, లారీల కొరత వల్ల అక్కడక్కడా కొనుగోళ్లు కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.

అయితే లారీల కొరత రాకుండా ఉండేందుకు మంచిర్యాల, భూపాలపల్లి TGMDCI ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడామని.. కొనుగోలు కేంద్రాల వద్దకు మరిన్ని లారీలను తరలిస్తున్నామని చెప్పారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సమీక్షిస్తూ.. ధాన్యానికి త్వరితగతిన గోదాములకు తరలించేలా యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.

ఇదే సమయంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మంత్రి వివేక్ తీవ్రంగా ఖండించారు.”సింగరేణి భవనాలను తగలబెట్టండి, రైలు పట్టాలను ధ్వంసం చేసి ఆందోళనలు చేపట్టండి అంటూ బాల్క సుమన్ కార్యకర్తలను రెచ్చగొట్టడం అత్యంత దుర్మార్గం. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న ఆందోళనల్లో అసలు రైతులు ఎవరూ పాల్గొనడం లేదని స్వయంగా బాల్క సుమనే ఒప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. దీన్నిబట్టి బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ నేతలపై తెలంగాణ రైతులకు నమ్మకం పూర్తిగా పోయిందని అర్థమవుతోంది అని మంత్రి ఎద్దేవా చేశారు.

©️ VIL Media Pvt Ltd.