Reading Time: 2 minutes
Srh Vs Rr Eliminator Pat Cummins Reveals Three Plans To Stop Vaibhav Sooryavanshi In Ipl 2026

Pat Cummins Plans For Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు నేడు న్యూ చండీగఢ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఎస్ఆర్‌హెచ్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అయితే ప్యాట్ కమిన్స్ సేనకు ఇప్పుడు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పెద్ద సవాల్‌గా మారాడు.

ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడు 14 మ్యాచ్‌లలో 583 పరుగులు బాదాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటికే ఒక సెంచరీతో పాటు ఎన్నో వేగవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ వైభవ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. తొలి మ్యాచ్‌లో కట్టడి చేసిన హైదరాబాద్ బౌలర్లు.. రెండో మ్యాచ్‌లో మాత్రం బుడ్డోడిని సెంచరీ చేయకుండా ఆపలేకపోయారు. అయినప్పటికీ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం మాత్రం ఎస్ఆర్‌హెచ్‌కే దక్కింది.

ఎలిమినేటర్‌కు ముందు జియోస్టార్‌తో మాట్లాడిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వైభవ్ వంటి బ్యాటర్‌ను ఎదుర్కోవాలంటే ప్లాన్-B, ప్లాన్-C కూడా సిద్ధంగా ఉండాలని తెలిపాడు. ‘ఒక బౌలర్‌గా ముందుగా మన బలాలపై నమ్మకం ఉండాలి. కానీ ప్రత్యర్థి జట్టులో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మార్చగల ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లు ఉంటారు. అలాంటి వారికి అదనంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాల్సి వస్తుంది. వైభవ్ కోసం కూడా మేము ప్రత్యేక ప్లాన్స్ రెడీ చేశాం. గత మ్యాచ్‌లో అతడు మా మీద సెంచరీ చేశాడు. కొన్ని సందర్భాల్లో వైభవ్, మరికొన్ని సందర్భాల్లో మేము ఆధిపత్యం చెలాయించాం. ఆ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం’ అని కమిన్స్ చెప్పాడు.

రాజస్థాన్‌పై ఈ సీజన్‌లో 100 శాతం విజయాల రికార్డు ఉండటం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందా? అనే ప్రశ్నకు కమిన్స్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘ప్రతి మ్యాచ్ కొత్తగా ప్రారంభమవుతుంది. కానీ గత మ్యాచ్‌ల నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మేము రాజస్థాన్‌తో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడాం. ఆర్ఆర్ ఆటగాళ్ల బలహీనతలు, బలాలను గమనించాం. మా ఆటగాళ్లు గత విజయాలను గుర్తు చేసుకుని, ఆ నమ్మకంతో ఫైనల్స్‌లోకి వెళ్లవచ్చు. ఓడిన జట్టుతో మళ్లీ ఆడటం మంచి అనుభూతినే ఇస్తుంది’ అని పేర్కొన్నాడు.

ఇప్పటికే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్‌లతో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బౌలింగ్‌లో కమిన్స్ నాయకత్వంలో మరింత ప్రమాదకరంగా మారింది. మరోవైపు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, జురెల్, ఫెరీరాలతో రాజస్థాన్ కూడా దూకుడుగా కనిపిస్తోంది. దీంతో ఈ ఎలిమినేటర్ మ్యాచ్ అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్‌గా మారనుంది.