Reading Time: 2 minutes
Siddaramaiah Likely To Resign Thursday Dk Shivakumar Karnataka Cm Race

కర్ణాటకలో గత కొద్దిరోజులుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య జరుగుతున్న కుర్చీ పంచాయితీ త్వరలోనే ముగింపు పలకబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మంగళవారం హస్తిన వేదికగా జరిగిన పంచాయితీ ఒక కొలిక్కి వచ్చినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. డీకే.శివకుమార్‌కు లైన్‌క్లియర్ అయినట్లుగా తాజా పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోంది.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయన గురువారం రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న నాయకత్వ మార్పు చర్చలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.

ఢిల్లీలో జరిగిన వరుస సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సిద్ధరామయ్యకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. “ఇప్పుడు మరో వ్యక్తికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది” అని రాహుల్ గాంధీ చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి స్పందించిన సిద్ధరామయ్య.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అయితే అధికారికంగా రాజీనామా చేయడానికి ఒకటి లేదా రెండు రోజుల సమయం కావాలని కోరినట్లు సమాచారం.

ఇక ఈ మార్పు ప్రక్రియలో భాగంగా సిద్ధరామయ్యకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కీలక పదవి ఆఫర్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కర్ణాటక రాజకీయాల్లో డీకే శివకుమార్ పేరు మళ్లీ బలంగా వినిపిస్తోంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించినప్పటి నుంచి సీఎం పదవిపై డీకే శివకుమార్ వర్గం ఆశలు పెట్టుకుంది. సీఎం పదవిని రొటేషన్ పద్ధతిలో పంచుకుంటారన్న ప్రచారం అప్పటి నుంచే సాగుతోంది. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అలాంటి ఒప్పందం లేదని చెబుతూ వచ్చింది. కానీ ఇటీవల ఢిల్లీలో జరిగిన వరుస రహస్య సమావేశాలు మరోసారి రాజకీయ ఊహాగానాలకు ఊపిరి పోశాయి. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మాత్రం సీఎం మార్పు చర్చలను ఖండిస్తోంది. ఢిల్లీలో జరిగిన సమావేశం కేవలం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల కోసమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. “ఈరోజు చర్చ మొత్తం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే జరిగింది. మీరు ఊహిస్తున్నదేమీ నిజం కాదు” అని పేర్కొన్నారు.

ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, రాహుల్ గాంధీ, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.