Reading Time: < 1 minute
Pakistan China Joint Statement Kashmir Xi Jinping Shehbaz Sharif India Reaction

దాయాది దేశం పాకిస్థాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. కాశ్మీర్ అంశాన్ని మరోసారి అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించేందుకే ఎత్తులు వేస్తోంది. తాజాగా చైనా పర్యటనతో ఈ విషయం తేటతెల్లమైంది. అయితే ఈ వ్యవహారంపై భారతదేశం తీవ్రంగా మండిపడుతోంది.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు. అయితే ఈ సందర్భంగా మరోసారి జమ్మూకాశ్మీర్ అంశాన్ని షరీఫ్ లేవనెత్తారు. ఇరువురి భేటీ అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో కూడా జమ్మూకాశ్మీర్ అంశంపై చర్చించినట్లుగా పేర్కొన్నారు.

పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జమ్మూ కశ్మీర్ పరిస్థితులపై తాజా పరిణామాలను పాకిస్థాన్.. చైనా ప్రతినిధులకు వివరించినట్లు పేర్కొంది. దీనిపై స్పందించిన చైనా.. జమ్మూ కశ్మీర్ వివాదం “చారిత్రకంగా మిగిలిపోయిన సమస్య” అని పేర్కొంటూ.. ఐక్యరాజ్యసమితి చార్టర్, భద్రతామండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

సంయుక్త ప్రకటనలో ఉపయోగించిన పదజాలం గత 2024లో విడుదల చేసిన చైనా-పాకిస్థాన్ సంయుక్త ప్రకటనతో దాదాపు సమానంగా ఉండటం గమనార్హం. అప్పటికీ జమ్మూ కశ్మీర్‌ను “చరిత్రలో మిగిలిన వివాదం”గా పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం పరిష్కారం కావాలని రెండు దేశాలు పేర్కొన్నాయి.

అయితే ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. గతంలోనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారత్‌కు అంతర్భాగమని స్పష్టం చేసింది. ‘‘ఈ అంశంపై వ్యాఖ్యానించే హక్కు మరే దేశానికీ లేదు” అని భారత్ తేల్చిచెప్పింది. అలాగే చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC) ప్రాజెక్టులపై కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న భారత భూభాగంలో కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్నారని భారత్ ఆరోపించింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ పాకిస్థాన్ నిరంతరం ప్రయత్నాలు చేస్తుండగా.. ఇది పూర్తిగా భారత అంతర్గత విషయం అని భారత్ పదేపదే స్పష్టం చేస్తోంది.