Reading Time: < 1 minute
West Bengal Bjp Government Illegal Bangladeshi Migrants Deportation Drive

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన వార్నింగ్ ఇచ్చారు. అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై చర్యలు ముమ్మరం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని హెచ్చరిస్తూ.. ‘‘వేగంగా పారిపోండి. వారిని జైలులో ఉంచి పోషించడం మాకు ఇష్టం లేదు. వారిని జైలులో ఉంచి, తిండి పెట్టి మన డబ్బుల్ని ఎందుకు వృధా చేయాలి.?’’ అని అన్నారు.

బెంగాల్ వ్యాప్తంగా అక్రమ వలసదారుల్ని పారద్రోలే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే చాలా మంది బంగ్లాదేశీయులు సొంత దేశం వెళ్లడానికి సరిహద్దుల వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు, ప్రభుత్వం చొరబాటుదారుల్ని గుర్తించి, నిర్బంధించడానికి ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. వీరి గుర్తింపు నిర్ధారించిన తర్వాత వీరిని బంగ్లాదేశ్ పంపనున్నారు. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయుల్ని, రోహింగ్యాలను గుర్తించాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది.

ఈ విషయంపై బెంగాల్‌లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం సువేందు అధికారి లిఖితపూర్వక ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేశారు. నిర్బంధ కేంద్రాల కోసం అనువైన ప్రదేశాలను గుర్తించి, వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలని జిల్లా యంత్రాంగాలను ప్రభుత్వం ఆదేశించింది. సీఎం నుంచి వస్తున్న హెచ్చరికలతో ఉత్తర 24 పరగణాలు, మాల్దా జిల్లాల్లోని సరిహద్దు వద్దకు బంగ్లాదేశీయులు చేరుకుంటున్నారు. చొరబాటుదారుల్ని అడ్డుకోవడం బీజేపీ ఎన్నికల హామీల్లో ప్రధానంగా ఉంది. ఇప్పుడు సువేందు సర్కార్ చర్యలకు ఉపక్రమించింది.