Reading Time: 2 minutes
Instagram Reels Friendship Minor Case Uttar Pradesh Viral Story

UP: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. చాలా మందికి కాలక్షేపంగా మారింది. కానీ, అదే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ యూపీలో ఒక విచిత్రమైన ఉదంతానికి దారితీశాయి. లైక్‌లు కొట్టుకోవడంతో మొదలైన పరిచయం.. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి, ఓ 14 ఏళ్ల మైనర్ బాలుడి ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మహారాజ్‌గంజ్ జిల్లాలోని నౌతన్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గోరఖ్‌పూర్‌కు చెందిన 40 ఏళ్ల ఓ మహిళకి, చెన్నైలో తన తండ్రితో కలిసి ఉంటున్న 14 ఏళ్ల బాలుడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఒకరి రీల్స్‌ను ఒకరు లైక్ చేసుకుంటూ, కామెంట్లు పెట్టుకుంటూ మొదలైన ఈ సోషల్ మీడియా స్నేహం కాస్తా, కాలక్రమేణా ప్రేమగా మారింది. ఆ బాలుడు తన పెద్ద కొడుకు కంటే ఐదేళ్లు చిన్నవాడనే విషయాన్ని సైతం ఆమె పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఆ మైనర్ బాలుడు తనను పెళ్లి చేసుకున్నాడని, కానీ ఇప్పుడు తనతో కలిసి ఉండటానికి నిరాకరిస్తూ మొహం చాటేస్తున్నాడంటూ సదరు మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ విచిత్రమైన ఫిర్యాదుతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వయసులో ఇంత వ్యత్యాసం ఉండటం, పైగా బాలుడు మైనర్ కావడంతో ఈ విషయం కాస్తా చుట్టుపక్కల ప్రాంతాల్లో దావానలంలా వ్యాపించి, స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి అధికారిక క్రిమినల్ కేసు నమోదు చేయలేదు. దానికి బదులుగా ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పరస్పర అవగాహనతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే స్థానిక పెద్దలు, పోలీసులు చేసిన చర్చలు, కౌన్సెలింగ్ తర్వాత ఆ మహిళ మనసు మార్చుకుంది. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి చట్టపరమైన చర్యలు అవసరం లేదని, కేసు పెట్టదలుచుకోలేదని పోలీసులకు రాతపూర్వకంగా తెలిపింది. భవిష్యత్తులో ఒకరినొకరు అసలు సంప్రదించకూడదని, ఎలాంటి పరిచయాలు పెట్టుకోకూడదని ఇరువైపులా అంగీకారం కుదరడంతో ఈ వివాదం ప్రశాంతంగా ముగిసిందని నౌతన్వా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బసంత్ సింగ్ వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వయసు వ్యత్యాసం, డిజిటల్ ప్రేమల తీరుపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు, ముఖ్యంగా మైనర్లకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, పరిచయాలు పెంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అలాగే, పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే విషయాలపై తల్లిదండ్రులు కచ్చితంగా నిఘా ఉంచాలని, వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడం చాలా ముఖ్యమని పోలీసులు స్పష్టం చేశారు.