Reading Time: < 1 minute
Marco Rubio India Visit Venezuela Oil Energy Talks Us India Relations

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ పర్యటనకు రాబోతున్నారు. ప్రస్తుతం స్వీడన్‌లో పర్యటిస్తున్న ఆయన.. రేపటి నుంచి భారతదేశంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే పర్యటనకు ముందు రూబియో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. అనూహ్యంగా వెనిజులా అంశాన్ని ప్రస్తావించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భారత్‌తో ఇంధన సహకారాన్ని మరింత విస్తరించాలన్న లక్ష్యంతో అమెరికా ముందుకెళ్తున్న నేపథ్యంలో వెనిజులా నుంచి కూడా భారత్‌కు చమురు సరఫరాలపై కూడా చర్చలు జరుగుతున్నాయని రూబియో వెల్లడించారు.

“భారత్‌కు ఎంత ఇంధనం అవసరమైతే అంత సరఫరా చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అమెరికా చరిత్రలోనే అత్యధిక స్థాయిలో చమురు ఉత్పత్తి, ఎగుమతులు జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. భారత్ ఇంధన అవసరాల్లో అమెరికా మరింత కీలక భాగస్వామిగా మారాలని ఆశిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ వచ్చే వారం భారత్ పర్యటనకు రావచ్చని కూడా రూబియో వెల్లడించారు. ఈ ప్రకటనను భారత్ లేదా వెనిజులా అధికారికంగా ప్రకటించేలోపే అమెరికా విదేశాంగ కార్యదర్శి వెల్లడించడం దౌత్య వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

వెనిజులా చమురు కొనుగోళ్లపై భారత్‌తో అమెరికా చర్చలు జరుపుతోందని.. ఇది రష్యా చమురుపై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఇంధన కొనుగోళ్ల విషయంలో దేశ ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

మే 23 నుంచి 26 వరకు భారత్‌లో పర్యటించనున్న మార్కో రూబియో కోల్‌కతా, న్యూఢిల్లీ, ఆగ్రా, జైపూర్ నగరాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా పాల్గొననున్నారు. భారత్‌ను “మంచి మిత్రదేశం.. గొప్ప భాగస్వామి”గా రూబియో అభివర్ణించారు.. ఇంధనం, రక్షణ, వాణిజ్య రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.