Reading Time: 2 minutes
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర ఫలితాలపై శాస్త్రాల హెచ్చరిక!

హిందూ సంప్రదాయంలో దీపారాధన అనేది కేవలం ఒక సాధారణ ఆచారం కాదు. అది జ్ఞానానికి, శుభానికి, ఐశ్వర్యానికి, దైవసాన్నిధ్యానికి ప్రతీకగా భావించబడుతుంది. ప్రాచీన కాలం నుండి పెద్దలు “దీపము కలిగిన ఇంటను, దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చున్. కాపాడుచుండు మనుజుల పాపంబుల పారద్రోలి పాలించు సుమీ.” అనే పద్యాన్ని పిల్లల చేత చెప్పించేవారు. ఇది ఇంట్లో దీపం వెలిగించడం వల్ల లభించే మహాలక్ష్మి కటాక్షాన్ని స్పష్టం చేస్తుంది.

సాధారణ సందేహాలు, శాస్త్ర ప్రమాణాలు..

నేటి కాలంలో దీపారాధనపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా పెద్దలు మరణిస్తే, దీపం వెలిగించాలా వద్దా, ఎన్ని రోజులకు పునఃప్రారంభించాలి అనే ప్రశ్న అనేకమందిని వేధిస్తుంది. శాస్త్రబద్ధమైన ధర్మాలను పరిశీలించినట్లయితే, ఒక్క రోజు కూడా ఇంట్లో దీపం వెలగకుండా భోజనం చేయరాదని స్పష్టంగా ఉంది.

మరణం, దీపం..

మరణించిన వ్యక్తికి సంబంధించిన దీపం వేరుగా ఉంటుంది. వ్యక్తి మరణించే సమయంలో, నేలపైన దక్షిణం శిరస్సుగా పడుకోబెట్టిన పిదప, ఆ శిరస్సు ఉండే వైపున దక్షిణం వైపు ఒకే వత్తి వేసి దీపం వెలిగిస్తారు. ఇది అశుభ సూచన కానప్పటికీ, ప్రాణానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఆ దీపంలో ఉండే అగ్ని ద్వారానే దహన సంస్కారాల నిమిత్తం జ్వాలలను సృష్టించడం జరుగుతుంది. ఇది దోషంగా భావించి, చాలామంది మరణానంతరం ఇంట్లో దీపాలు వెలిగించడం మానేస్తున్నారు.

నూనె దీపం Vs. విద్యుత్ దీపం..

విద్యుత్ దీపాలు వెలిగించినప్పటికీ, అవి నూనెతో వెలిగించే దీపంతో సమానం కావు. నూనెతో వెలిగించే దీపం ఆరోగ్య హేతువు అని, విద్యుత్ కాంతితో వెలిగే దీపం శరీరానికి దోషం కలిగిస్తుందని శాస్త్రం చెబుతుంది. నూనె దీపారాధన వల్ల కలిగే ఆధ్యాత్మిక, మానసిక, కుటుంబ శ్రేయస్సు ప్రత్యేకమైనది.

ఆశౌచ సమయంలో దీపారాధన నియమాలు

ఇంట్లో ఎవరైనా పెద్దలు మరణించిన యెడల, ఆ ఇంట్లో ఆశౌచం ఉంటుంది. అటువంటి సందర్భంలో, ఆశౌచము లేని ఎదురింటి వారు, పక్కింటి వారు, దూరపు బంధువులు లేదా తెలిసినవారు ప్రతిరోజూ సాయంత్రం వేళ దీపం వెలిగించాలి. దీపం లేని ఇంట ఎవరూ భోజనం చేయకూడదు అనేది నియమం.

దీపారాధన పునఃప్రారంభం…

కర్మలు అయిన తదుపరి 13వ రోజున, ఇంట్లో దేవతారాధన చేసేటటువంటి చోట పరిశుభ్రపరిచి, ఆశౌచము లేని బ్రాహ్మణులు, పండితులు లేదా పెద్దల సమక్షంలో దేవతారాధన చేయాలి. చక్కగా దీపపు ప్రమిదను కడిగి, తైలము వేసి, దీపం వెలిగించి, కుంకుమ చేత అలంకరించి నమస్కరించిన పిదప, ఆ ఇంట్లో ఉండే వారికి ఆశౌచం తొలగిపోతుంది. ఆ రోజు మొదలుకొని ప్రతిరోజూ దీపారాధనను పునఃప్రారంభించాలి.

నిత్య దీపారాధన ఆగిపోతే కలిగే పరిణామాలు..

ఏ ఇంట్లో నిత్య దీపారాధన ఆగిపోతుందో, ఆ ఇంట్లో దరిద్ర దేవత వచ్చి చేరుతుందని శాస్త్రం హెచ్చరిస్తుంది. అష్టకష్టాలు ఆ ఇంటి వారికి వచ్చి చేరుతాయి. అందుకే నిత్య దీపారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. ఇంట్లో వెలుగు, ఐశ్వర్యం, సానుకూల శక్తి పెరగడానికి శాస్త్రాలు దీపారాధనను సూచించాయి. ఈ విలువైన సందేశాన్ని బ్రహ్మర్షి కాకునూరి సూర్యనారాయణ మూర్తి శాస్త్ర ప్రమాణాలతో అందించారు. ప్రతిరోజూ దీపం వెలిగించడం ద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ, అందరి క్షేమాన్ని కోరుకుందాం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)