Reading Time: 2 minutes
Nag Ashwin Emotional Speech Sing Geetham Movie Success Meet Singeetham

Nag Ashwin: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు, కొన్ని ప్రాజెక్టులు కేవలం వ్యాపారం కోసం కాకుండా.. ఒక పెద్ద సంకల్పంతో, నమ్మకంతో జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్‌లో విడుదలై, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ‘మహానటి’ రేంజ్ గుడ్‌విల్‌ను సొంతం చేసుకున్న ఓ డిఫరెంట్ మ్యూజికల్ ఫిల్మ్ ‘సింగ్ గీతం’. తాజాగా నిర్వహించిన ఈ చిత్ర సక్సెస్ మీట్‌లో ఈ మూవీ నిర్మాత, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారితో ప్రయాణం, ఈ సినిమా వెనుక పడిన శ్రమను ఆయన పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే నాకు మాటలు రావడం లేదు, స్పీచ్‌లెస్. ఏడేళ్ల క్రితం ‘మాయాబజార్’ సినిమా సెట్స్‌పై సావిత్రి గారిని నేరుగా చూసిన, కె.వి.రెడ్డి గారి దగ్గర తిట్లు తిన్న, ‘ఆదిత్య 369’ లాంటి అద్భుతాన్ని సృష్టించిన ఆ మహానుభావుడిని (సింగీతం శ్రీనివాసరావు గారిని) జీవితంలో ఒక్కసారి కలిసి హ్యాండ్‌షేక్ ఇస్తే చాలు అనుకున్నాను. కానీ ఈరోజు ఆయనతోనే కలిసి సినిమా చేసే అవకాశం రావడం వెనుక ఏదో ఒక దైవ సంకల్పం ఉందనే నేను నమ్ముతాను. నేను కేవలం దారి క్లియర్ చేశానంతే.. మీరంతా ఒక నదిలా మారి ఈ సినిమా అనే సముద్రాన్ని సృష్టించారు” అని అన్నారు.

“గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు సింగీతం సార్ ఆరోగ్యం కొంచెం నలతగా ఉంది. అసలు ఎలాంటి సినిమా ఆడతది, ఎలాంటిది ఆడదు అని డిసైడ్ చేయడానికి మనం ఎవరు? ఆయనకు నచ్చింది మనం తీయాలి అని ఫిక్స్ అయ్యాం. ఒక ఏడాది పాటు రైటింగ్ రూమ్‌లో కూర్చుని స్క్రిప్ట్ రెడీ చేశాం. నిజం చెప్పాలంటే.. మొదట్లో ఈ సినిమా ప్రాసెస్ ఏంటో మాకే అర్థం కాలేదు. ఎందుకంటే ఇలాంటి సినిమాకు ముందెన్నడూ ఒక ప్రాసెస్ లేదు. కానీ, ఆ తర్వాత మణి, సంకల్ప్, అంకుర్, అరవింద్, ప్రకృతి.. ఇలా అందరూ తోడై టీమ్ స్ట్రాంగ్ అయ్యింది. ఈ సినిమాకు అసలైన వెన్నుముక మా నిర్మాత డి.వి.సి ప్రసాద్ గారు. ‘ప్రపంచంలోనే, ఇండియాలోనే ఇలాంటి సినిమా రాలేదు’ అని సింగీతం సార్ ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన మాట నమ్మి మేము ముందుకు వెళ్లాం” అని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా కాస్టింగ్ చాలా వింతగా, క్రేజీగా జరిగింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరినీ సింగీతం సార్ పర్సనల్ లేదా వీడియో కాల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేశారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే.. ఆడిషన్స్ కి వచ్చిన వాళ్లందరి చేత సార్ పాటలు పాడించారు. నివేదా పేతురాజ్ ఆడిషన్స్ బలే గమ్మత్తుగా జరిగింది. ఆమె ఆడిషన్ టైంలో తన వెనుక ఒక చెట్టు ఉంది.. ‘నాకు ఎప్పుడు బాధ అనిపించినా ఈ చెట్టుతోనే మాట్లాడతాను’ అని సార్‌తో చెప్పింది. ఆ పాయింట్ నచ్చే సార్ సినిమాలో ఒక సీన్‌నే క్రియేట్ చేశారు. ఇవాళ అయాన్, ఐలియా, షాలు.. ఇలా అందరి టాలెంట్‌ను ప్రపంచం గుర్తిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాను నేను ఇప్పటికే వంద సార్లు చూసుంటాను” అని ఎమోషనల్ అయ్యారు.

“ఈ సినిమాకు స్టోరీ, డైరెక్షన్ అన్నీ సింగీతం సార్ చూసుకున్నప్పటికీ.. దీనికి ‘అసలైన డైరెక్టర్’ అని పిలవాల్సింది మాత్రం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గారిని మాత్రమే. ఎందుకంటే, ఇది మ్యూజికల్ ఫిల్మ్ కావడం వల్ల ప్రతి డైలాగ్, ఎమోషన్ సంగీతం ద్వారానే ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వాలి. ప్రొఫెషనల్ సింగర్స్‌తో కాకుండా.. నటీనటుల చేతే నేరుగా పాటలు పాడించి, లాస్ట్ మినిట్ వరకు టెంపో అడ్జస్ట్ చేస్తూ డీఎస్పీ పడిన శ్రమ అసాధారణమైనది. లాస్ట్ 3-4 రోజులు చాలా కష్టపడ్డాం. కానీ క్లైమాక్స్, ఆ రెండు పాటలు గోల్డ్.. ప్యూర్ గోల్డ్ అంతే!”. అలాగే “ఈ సినిమాకు రెండో ముఖ్యమైన పిల్లర్ సంకల్ప్. పదేళ్ల క్రితం నేను వాడిని డైరెక్ట్ చేశాను.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది (నవ్వుతూ). ప్రతి షాట్ విషయంలో వాడిని ఎంత టార్చర్ పెట్టాలో అంత పెట్టాను. ఈ సినిమా ఒక వైపు 94 ఏళ్ల వయసున్న సింగీతం సార్ ఆలోచనలు, మరోవైపు 24 ఏళ్ల కుర్రాడైన సంకల్ప్ మైండ్ సెట్ మధ్య జరిగింది. అందుకే ఈ సినిమాలో అంతటి లోతైన ఆత్మ, ఆధునికత కలగలిసి ఉన్నాయి. ‘మహానటి’ తర్వాత ప్రేక్షకులు ఒక సినిమాను ఇంతలా ఓన్ చేసుకుని, పది మందికి రికమండ్ చేస్తూ థియేటర్లకు రావడం నేను ఈ సినిమాకే చూస్తున్నాను” అని అన్నారు.