
ప్రైవేటు..కార్పొరేట్ స్కూల్ విద్యార్థులు ధరించే మన్నికైన యూనిఫాంలు.. వారికి ఏమాత్రం తీసిపోని విధంగా బ్రాండెడ్ షూ.. సాక్సులు.. టై, బెల్టులు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు అందనున్నాయి.. నాణ్యమైన వస్త్రం సరఫరా అయితేనే యూనిఫాంలు ఎక్కువ రోజులు మన్నుతాయి. అందుకే విద్యార్థులకు అందజేసే యూనిఫాంలకు సంబంధించి వస్త్రం సరఫరా మొదలు కుట్టు పని వరకు ప్రతి దశలోనూ నాణ్యతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల పాఠశాలలు, గురుకులాల్లోని విద్యార్థులకు మఫత్‌లాల్ వంటి పేరెన్నికల గల సంస్థ నుంచి యూనిఫాం వస్త్రాన్ని ఈ దఫా సేకరిస్తున్నారు. యూనిఫాంతో పాటు స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, బెడ్డింగ్ సామగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా ఇలా ప్రతి దానిలోనూ ప్రభుత్వం నాణ్యతకు పెద్ద పీట వేసింది. గతంలో పాఠశాల విద్యా విభాగం, ఏ గురుకుల విభాగానికి ఆ గురుకుల విభాగం విద్యార్థులకు అవసరమయ్యే సామగ్రి వేర్వురుగా కొనుగోలు చేసి అందజేసేవి.. దాంతో అనేకరకాల హెచ్చుతగ్గులు కనిపించేవి. కొన్ని పొరపాట్లు చోటుచేసుకునేవి.. ఆ సమస్యలను అధిగమించి సామగ్రి సేకరణ.. పంపిణీలో ఏకరూపత కోసం ఈ ఏడాది ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్ తీసుకువచ్చింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధి విద్యా సంస్థల విద్యార్థులకు మన్నికైన యూనిఫాం, ఇతర సామగ్రి అందజేసేందుకు రూ.687.78 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. దీనిని ఖర్చుగా కాకుండా భవిష్యత్ తరాలపై పెట్టే వ్యయంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నాయి..
మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంకు సంబంధించి 2.97 కోట్ల మీటర్ల వస్త్రం కొనుగోలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మఫత్‌లాల్ కంపెనీ 2.41 కోట్ల మీటర్లు, తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ (TGSCO) 55.32 లక్షల మీటర్ల వస్త్రం సరఫరా చేస్తున్నాయి. ఇందులో విద్యార్థినీవిద్యార్థులకు లైట్ బ్లూ, డార్క్ బ్లూ, వైట్, ప్లెయిన్ మెరూన్, మెరూన్ చెక్స్ రంగుల్లో యూనిఫాంలు అందజేయనున్నారు. విద్యార్థినులకు ష్కర్ట్, పంజాబీ డ్రెస్, చున్నీ సరఫరా చేయనున్నారు. ఈ దఫా విద్యార్థులకు యూనిఫాం రంగులను ప్రభుత్వం మార్చింది. డే స్కాలర్స్‌కు టాప్ లైట్ బ్లూ, లోవర్స్ డార్క్ బ్లూ యూనిఫాంలో ఉండనున్నాయి. గురుకులాల్లోని విద్యార్థులకు టాప్‌లో మెరూన్ చెక్, లోవర్ మెరూన్ యూనిఫాంలో ఉండనున్నాయి.
యూనిఫాం కుట్టు పనిని మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అప్పజెపింది.. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రోజుకు 75 వేల నుంచి లక్ష యూనిఫాంలు కుట్టే సామర్థ్య ఉంది. ఒక్కో యూనిఫాం కుట్టు పనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.75 చెల్లిస్తుంది. సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాంలు అందించనున్నారు. ఈ పనితో సంఘాల్లోని మహిళలకు సుమారు రూ.40 కోట్లకుపైగా ఆదాయం సమకూరనుంది.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన సామగ్రితో కూడిన కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇందులో యూనిఫాంతో పాటు తెల్లని బూట్లు, తెల్లని సాక్సులు ఉంటాయి. గతంలో బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు మాత్రమే బూట్లు ఇచ్చేవారు. ఈ దఫా అన్ని రకాల యాజమాన్యాల్లోని విద్యార్థులకు బూట్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, పట్టణ గురుకుల పాఠశాలల విద్యార్థులకు బెల్టు, ఐడీ కార్డు, టై, స్కూల్ బ్యాగు, బూట్లు (నలుపు, తెలుపు – సాక్సులతో), బెడ్డింగ్ సామగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా, ట్రంక్ బాక్సు, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్ తో కూడిన సంపూర్ణమైన కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. మైనారిటీ గురుకులాల్లోని విద్యార్థులకు తొలిసారిగా ట్రాక్ సూట్, నైట్ డ్రెస్ లను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ పాఠశాలల్లోని విద్యార్థులకు తొలిసారిగా నల్లటి బూట్లు, బెల్టును రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.
ఇప్పటి వరకు ప్రభుత్వాలు పాఠశాలలకే పెద్దపీట వేశాయి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులపైనా ప్రత్యేకంగా దృష్టిసారించింది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా తొలిసారి ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లోని సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు కాలేజీ బ్యాగు, బెల్టు, టై, నల్లటి బూట్లు, సాక్సులు అందజేయనుంది.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోని విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఇప్పటికే ఆయా సంస్థలకు చేరాయి. తొలి వారంలోనే వాటి పంపిణీ పూర్తి కానుంది. విద్యార్థులకు యూనిఫాంతో పాటు అందజేసే బూట్లు, సాక్సులు, టైలు, బెల్టులు, గురకుల్లాలోని విద్యార్థులకు అందజేసే దుప్పట్లు, ప్లేట్లు, గ్లాస్‌లు ప్రతి ఒక్కటి నాణ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ టెండర్లను పిలిచింది. మిగిలిన ఆర్డర్లను TGSCO, TGLIPC, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ – TGTPCలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేస్తున్నది రూ.687.78 కోట్లు మాత్రమే. పేద, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన సామగ్రి అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా జాతీయ ఈ టెండర్ల పద్ధతిని పాటిస్తోంది. ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు, దురుద్దేశ్యపూరితంగా రూ.వేల కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.
యూనిఫాం, బెడ్డింగ్ ఆర్డర్లలో 25–30% తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘానికి (TGSCO)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇందులో 25% యూనిఫాం వస్త్రం (సుమారు 56 లక్షల మీటర్లు), 100% దుప్పట్లు (6,49,381), 3 లక్షల బెడ్‌షీట్లు, 2.29 లక్షల కార్పెట్లు ఉన్నాయి. ఈ ఆర్డర్‌తో చేనేత కార్మికులకు ఆదాయం సమకూరనుంది. టైలు, బెల్టులు, ఐడీ కార్డుల ఆర్డర్‌ను తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ (TGLIPC)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ ఆర్డర్‌తో ఆ సంస్థ ఆర్థికంగా బలోపేతం కానుంది.
ప్రభుత్వం విద్యార్థులకు అందజేసే యూనిఫాం, టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, దుప్పట్లు, బెడ్‌షీట్లు, కార్పెట్లతో యూనిఫాంలు కుట్టే మహిళలు, దుప్పట్లు, కార్పెట్లు తయారుచేసే చేనేత కార్మికులు, బెల్టులు, ఇతర సామగ్రి తయారీతో TGLIPC పరిధిలోని కార్మికులకు ఆదాయం లభిస్తుంది. గత ప్రభుత్వం హయాంలో పాఠశాల విద్యా శాఖతో పాటు ఏ గురుకుల సంస్థకు ఆ గురుకుల సంస్థ యూనిఫాంతో పాటు ఇతర సామగ్రి తయారీ సేకరణ, పంపిణీ చేపట్టేవి. ఇందులో ఏకరూపత లేకపోవడంతో అనేక అవకతవకలు చోటు చేసుకునేవి. ఈ వస్తువుల సరఫరాలో పాతుకుపోయిన కొన్ని ముఠాలు నాసిరకమైన వస్త్రం, ఇతర సామగ్రి పంపిణీ చేసి భారీగా దండుకునేవి. పైగా ఆ నాసిరకం సామగ్రి పంపిణీ ఏడాదిపొడవునా సాగేది. ఆ అవకతవలన్నింటికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారిగా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దీంతో అన్ని రకాల యాజమాన్యాల్లోని విద్యార్థులకు ఏకకాలంలో యూనిఫాంలు, కిట్లు, ఇతర సామగ్రి అందనున్నాయి.