
భారత సైన్యం దుస్తుల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. బ్రిటిష్ పాలన కాలం నుంచి కొనసాగుతున్న కొన్ని పాత సంప్రదాయాలను తొలగిస్తూ, భారతీయతను ప్రతిబింబించే కొత్త విధానాలను తీసుకొచ్చింది.
ఆర్మీ యూనిఫామ్స్-2026 పేరుతో విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల్లో ఈ మార్పులను వివరించింది. ఇందులో భాగంగా అధికారుల అధికారిక పౌర దుస్తుల్లో స్వదేశీ శైలికి చెందిన బందీ జాకెట్‌ను చేర్చింది.
ఇప్పటివరకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో సమీక్షా అధికారులు తప్పనిసరిగా కత్తి ధరించాల్సి ఉండేది. ఇకపై అది తప్పనిసరి కాదు. అలాగే మెస్ డ్రెస్సులతో ఉపయోగించే పౌచ్ బెల్ట్‌ను కూడా తొలగించింది. “రాయల్” వంటి బ్రిటిష్ కాలం నాటి పదాల వినియోగాన్ని కూడా నిలిపివేయనుంది.
►ALSO READ | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. యాత్రకు వెళ్తూ బావిలో పడ్డ పికప్ వ్యాన్.. 8 మంది మృతి
ఇకపై గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, ఆర్మీ డే వంటి ముఖ్యమైన కవాతుల్లో మాత్రమే ఎంపిక చేసిన అధికారులు, సిబ్బంది కత్తులు ధరిస్తారు. సమీక్షా అధికారులు మాత్రం కత్తులు ధరించరు.
అంతేకాకుండా, ప్రస్తుతం ఉపయోగిస్తున్న శీతాకాలపు యూనిఫామ్ స్థానంలో కొత్త ఆర్మీ బ్యాటిల్ జాకెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ మార్పు దశలవారీగా అమలు చేయనున్నారు. 2029 నాటికి కొత్త జాకెట్ అన్ని ర్యాంకుల సైనికులకు అందుబాటులోకి రానుంది.
సైన్యం ప్రకారం తెలిపిన వివరాల ప్రకారం..ఈ మార్పుల ఉద్దేశం పాత వలసవాద సంప్రదాయాలను తొలగిస్తూ, భారతీయ సంస్కృతి, జాతీయ భావాలను ప్రతిబింబించేలా సైనిక వ్యవస్థను ఆధునీకరించడమని స్పష్టం చేసింది.