Reading Time: < 1 minute
Chandrababu Ex Gratia Krishna River Boat Accident Palnadu

CM Chandrababu : పల్నాడు జిల్లా కోనూరు వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ బోల్తా ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, ప్రమాద విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచే పల్నాడు జిల్లా కలెక్టర్ , ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పడవ నదిలోని ఇసుక దిబ్బను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని, ఇందులో నలుగురు మృతి చెందగా మిగిలిన ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గంధం శైను, గంధం సంధ్య, బత్తుల కార్తీక్, కాంతం చైతన్యల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఆర్థిక సహాయాన్ని మృతుల కుటుంబాలకు తక్షణమే అందజేయాలని పల్నాడు కలెక్టర్‌ను ఆదేశించారు. నది నుంచి వెలికితీసిన మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన అనంతరం బంధువులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారుల బృందంతో పూర్తి స్థాయి విచారణ జరిపించి సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణ ఘోరాలు పునరావృతం కాకుండా నదీ తీరాల్లో కఠినమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై తదుపరి సహాయక చర్యలు, సమన్వయం కోసం విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక అధికారి ప్రఖర్ జైన్, సమాచార పౌరసంబంధాల విభాగం డైరెక్టర్ విశ్వనాథ్ , జిల్లా కలెక్టర్‌కు బాధ్యతలను అప్పగించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.