Reading Time: 2 minutes
Summer Healthy Drinks Hydration Tips Telugu

ఈ సారి ఎండలు మరి మండిపోతున్నాయి. దీంతో ఈ వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం ఒక సవాలుతో కూడుకున్న పని. శరీర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల త్వరగా అలసట చెందడం, నీరసం రావడం సహజం. అయితే, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా పానీయాల ఎంపిక మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దాహం వేసినప్పుడు ఏదో ఒక పానీయం తాగడం కంటే, ఏది మన శరీరానికి మేలు చేస్తుందో తెలుసుకోవడం ప్రాథమిక అవసరం.

సాధారణంగా హైడ్రేషన్ అంటే కేవలం నీరు తాగడం మాత్రమే అని చాలామంది భావిస్తారు. కానీ, పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీర అవసరాలకు తగ్గట్టుగా ఎలక్ట్రోలైట్లు, పోషకాలు కలిగిన పానీయాలను ఎంచుకోవడమే అసలైన హైడ్రేషన్. కొన్ని పానీయాలు తాత్కాలికంగా చల్లదనాన్ని ఇచ్చినట్లు అనిపించినా, అవి శరీరంలో చక్కెర స్థాయిలను పెంచి మనల్ని మరింత నీరసపరుస్తాయి. కొన్ని పానీయాలు మనల్ని చల్లబరుస్తాయని భావిస్తాం, కానీ అవి కేవలం ‘ఖాళీ కేలరీల’ను (Empty Calories) అందించి మనల్ని మరింత నీరసంగా మారుస్తాయి.

మీరు దూరంగా ఉండాల్సిన పానీయాలు (Danger Zone):

ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్: వీటిలో ఫైబర్ ఉండదు, చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగి, ఆపై శక్తిని తగ్గించేస్తాయి.పండ్లను రసంగా మార్చి ప్యాక్ చేసే ప్రక్రియలో వాటిలో ఉండే సహజమైన పీచు పదార్థం (Fiber) పూర్తిగా తొలగించబడుతుంది. దీనివల్ల పండ్ల ద్వారా అందే అసలైన పోషకాలు మనకు అందవు.

ఐస్డ్ టీ: ఐస్డ్ టీలో ఉండే కెఫీన్ ఒక ‘డైయూరిటిక్’ (Diuretic) గా పనిచేస్తుంది. దీనివల్ల మూత్రవిసర్జన పెరిగి, శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. మార్కెట్లో దొరికే ఐస్డ్ టీలలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. కెఫీన్ కలయిక వల్ల తాత్కాలికంగా శక్తి వచ్చినట్లు అనిపించినా, ఆ తర్వాత శరీరం మరింత నీరసంగా మారుతుంది. కనుక వేసవిలో ఐస్డ్ టీకి బదులుగా సహజసిద్ధమైన చల్లదనాన్ని ఇచ్చే మజ్జిగ, సబ్జా గింజల నీరు లేదా నిమ్మరసం (తక్కువ చక్కెరతో) తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ప్రోటీన్ షేక్స్: ప్యాకేజ్డ్ ప్రోటీన్ షేక్స్‌ను జీర్ణం చేసుకోవడం శరీరానికి కొంత కష్టమైన ప్రక్రియ. వీటిని అరిగించుకోవడానికి శరీరం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో (Thermic effect of food) ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. దీనివల్ల వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. అంతే కాదు వీటిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపించడం లేదా మందకొడిగా (Sluggish) ఉన్నట్లు అనిపించవచ్చు.

శీతల పానీయాలు(ఫ్లేవర్డ్ సోడా): ఇందుల్లో ఉండే కార్బనేషన్ (గ్యాస్), విపరీతమైన చక్కెర వల్ల కడుపు ఉబ్బరంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. వీటిలో ఉండే అధిక చక్కెర వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించకపోగా,సోడాలు తాగినప్పుడు దాహం తీరినట్లు అనిపించినా, అందులోని సోడియం, చక్కెర కంటెంట్ వల్ల శరీరం లోపల మరింత నీటిని కోల్పోయే ప్రమాదం ఉంది.

ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు:
కొబ్బరి నీరు: కొబ్బరి నీరు సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది, ఇది శరీరానికి కావాల్సిన తేమను (Hydration) సమర్థవంతంగా అందిస్తుంది.మార్కెట్లో దొరికే ఇతర కృత్రిమ పానీయాల మాదిరిగా ఇందులో అదనపు చక్కెరలు ఉండవు, కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా సురక్షితం.ఎండల వల్ల కలిగే నీరసం నుంచి ఉపశమనం కలిగించి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

కోకుమ్ రసం: కోకుమ్ రసం జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.ఇది కడుపులో ఎసిడిటీ, ఉబ్బరం (Bloating) వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కనుక భోజనం చేసిన తర్వాత కోకుమ్ రసం తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

మూలికా నీరు: నీటిలో పుదీనా ఆకులు, పుచ్చకాయ ముక్కలు, నారింజ లేదా నిమ్మకాయ స్లైసులు కలపడం వల్ల శరీరానికి అవసరమైన సహజమైన చల్లదనం లభిస్తుంది. ఈ పద్ధతిలో పండ్లు, మూలికల్లోని పోషకాలు, ఎలక్ట్రోలైట్లు నీటిలో చేరి శరీరానికి మేలు చేస్తాయి. తులసి, పుదీనా వంటి మూలికలు మనసును, శరీరాన్ని తాజాగా ఉంచుతాయి. కనుక ఇలాంటివి కూడా చేర్చుకొని తాగితే మంచి బలం వస్తుంది.

గమనిక: మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వృత్తిపరమైన వైద్య సలహా కోసం మీ డాక్టరును సంప్రదించడం ఉత్తమం.