Reading Time: < 1 minute

118 కాదు 120కి పెరిగిన TVK బలం.. విజయ్కి జై కొట్టిన ఇద్దరు IUML ఎమ్మెల్యేలు !

Caption of Image.

చెన్నై: హంగ్ కారణంగా హైడ్రామాకు కేరాఫ్గా మారిన తమిళనాడు రాజకీయాలు టీవీకే అధినేత విజయ్కు పూర్తి అనుకూలంగా మారిపోయాయి. కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2) పార్టీలకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతుతో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ తరుణంలో విజయ్ పార్టీకి మరో అంశం కలిసొచ్చింది.

డీఎంకే మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కూడా టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. తమిళనాడులో IUML ఎమ్మెల్యేలు ఇద్దరు గెలిచారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలపడంతో విజయ్ టీవీకే ప్రభుత్వ బలం మ్యాజిక్ ఫిగర్ 118 దాటి 120కి చేరింది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కొంత మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గాను108 సీట్లలో జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. డీఎంకే పార్టీ 60 స్థానాలకు, ప్రతిపక్ష అన్నాడీఎంకే 47 సీట్లకు పరిమితమయ్యాయి.

తమిళ సినీ దిగ్గజం విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఎన్నికల బరిలో దిగిన తొలిసారే అద్భుతమైన ఫలితాలను సాధించి తమిళనాడు ఓటర్ల విలక్షణ తీర్పునకు అద్దం పట్టింది. దశాబ్దాలుగా తమిళనాడును శాసిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకే లాంటి బలమైన పార్టీలను వెనక్కి నెట్టి, టీవీకే విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది.

©️ VIL Media Pvt Ltd.