Reading Time: 2 minutes

కృష్ణానగర్ వరద సమస్యకు నెల రోజుల్లో పరిష్కారం చూపిస్తా: హైడ్రా కమిషనర్ రంగనాథ్

Caption of Image.

హైదరాబాద్ లో వర్షాకాలం వచ్చిందంటే రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలే ట్రాఫిక్, ఉప్పొంగే డ్రైనేజీలు.. తెరుచుకుని ఉండే మ్యాన్ హొల్స్ వెరసి వాహనదారులకు నరకప్రాయంగా ఉంటుంది. ఇక కృష్ణానగర్ నగర్ గురించి ఎంత చెప్పినా తక్కువే…చిన్నపాటి వర్షానికే రోడ్ల మీద డ్రైనేజీ ఉప్పొంగి ప్రవహిస్తూ వరదను తలపిస్తుంటుంది. ఈ క్రమంలో కృష్ణానగర్ వరద సమస్యపై ఫోకస్ పెట్టింది హైడ్రా. కృష్ణానగర్ వరద సమస్యను నెల రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

కృష్ణానగర్‌లో కాలువల్లో పూడిక తీత పనులు ముమ్మరం చేసింది హైడ్రా. స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి పనులను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.  దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వరద కాలువను క్షేత్రస్థాయిలో పరిశీలించారు అధికారులు. నాలాల్లో డీసిల్టింగ్ పనుల్లో జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా భాగస్వామ్యం వహిస్తోంది.

ఎగువ ప్రాంతాలైన జూబ్లీహిల్స్, వెంకటగిరి నుంచి వచ్చే మట్టి కారణంగా సమస్య తీవ్రత పెరుగుతోందని అంటున్నారు అధికారులు. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు చర్యలు చేపట్టామని అన్నారు. కృష్ణానగర్ వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా చర్యలు చేపట్టామని తెలిపారు.

ప్రత్యామ్నాయ వరద కాలువ నిర్మాణంపై ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నారని..8 నుంచి 9 అడుగుల లోతున్న కాలువల్లో 6 నుంచి 7 అడుగుల మేర పూడిక పేరుకుపోయిందని తెలిపారు అధికారులు. అవసరమైతే స్లాబులు తొలగించి పూర్తి స్థాయిలో పూడిక తొలగిస్తామని స్పష్టం చేశారు కమిషనర్ రంగనాథ్. నాలాపై నిర్మించిన ఒకటి రెండు ఇళ్లను గుర్తించామని…తప్పనిసరి పరిస్థితి వస్తేనే తొలగింపు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

ఇళ్ల ఖాళీ చేయించటానికి ముందు నోటీసులు, తగిన సమయం ఇస్తామని హామీ ఇచ్చారు కమిషనర్ రంగనాథ్. 2021 తర్వాత పూర్తి స్థాయిలో పూడిక తీత పనులు జరగలేదని అంటున్నారు స్థానికులు. గతేడాది వర్షాకాలంలో హైడ్రా మెట్ టీమ్స్ కొంత మేర పూడిక తొలగించారని..ఈసారి వేసవిలోనే పనులు ప్రారంభించి వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు కమిషనర్. స్లాబులు తొలగించిన ప్రాంతాల్లో బలమైన గ్రిల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు కమిషనర్ రంగనాథ్.
 

©️ VIL Media Pvt Ltd.