
ఖరీదైన సైబీరియన్ హస్కీ కుక్కలు వీధుల్లో తిరుగుతున్న ఉదంతం కలకలం సృష్టిస్తోంది. విదేశీ జాతికి చెందిన ఈ ఖరీదైన కుక్కలను పెంచలేక నడిరోడ్డుపై వదిలేస్తున్నారు యజమానులు. సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఈఘటనపై బీడీఎల్ భానూరు పోలీసులు వేగంగా స్పందించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
నందిగామ గ్రామ శివారులో సైబీరియన్ హస్కీ కుక్కలను వదిలిపెట్టినట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్, వాహనాల కదలికలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, మియాపూర్ కల్వరి టెంపుల్ సమీపంలో నిందితుల వాహనాన్ని గుర్తించారు. ఈ కేసులో ఫతేనగర్‌కు చెందిన సత్యనారాయణ, హనుమాన్‌పేటకు చెందిన సుధీర్ బాబు, కొల్లూరు గ్రామానికి చెందిన సుందర్ సింగ్, రామ్ నరేష్ నగర్‌కు చెందిన ఎస్.ఏ. సత్యనారాయణలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు కలిసి సైబీరియన్ హస్కీ జాతికి చెందిన కుక్కలను సంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామ శివారులో వదిలిపెట్టినట్లు విచారణలో తేలింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన భానూరు పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో నిందితులు పలు కీలక విషయాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. తమ వద్ద ఉన్న స్థలం సరిపోకపోవడం, కుక్కల వయసు పెరగడంతో వాటిని సంరక్షించడం కష్టంగా మారిందని, అందుకే గ్రామ శివారులో వదిలిపెట్టినట్లు అంగీకరించినట్లు చెబుతున్నారు. అయితే జంతువులను ఇలా అనాథలుగా వదిలేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు. పెంపుడు జంతువులను బాధ్యతగా చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. యజమానులు వాటిని రోడ్లపై వదిలేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తడమే కాకుండా, జంతువుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కుక్కలను తరలించడానికి ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు మియాపూర్‌లోని కల్వరి టెంపుల్ సమీపంలో గుర్తించారు.
ఈ కేసులో మరో కీలక పరిణామం ఏమిటంటే, ఈ కుక్కల నిర్వహణలో కల్వరి టెంపుల్ పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. జంతువులకు సంబంధించిన లైసెన్స్‌లు, అనుమతులు, వాటి సంరక్షణలో నిబంధనలు పాటించారా లేదా అన్న అంశంపై సమగ్ర సమాచారం ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులకు లేఖ రాశారు.
ఖరీదైన జంతువులను కేవలం స్టేటస్ సింబల్ లేదా ఫ్యాషన్‌గా కొనుగోలు చేసి, అవి పెద్దయ్యాక వదిలేయడంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సైబీరియన్ హస్కీ వంటి మంచు ప్రాంత జాతులకు ప్రత్యేక వాతావరణం, ఖరీదైన ఆహారం అవసరం. ఇవి తెలియకుండా కొనుగోలు చేసి, ఆ తర్వాత భారంగా భావించి అనాథలుగా వదిలేయడం క్రూరత్వమని వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జంతు హింస నిరోధక చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..