Reading Time: 2 minutes
Abhishek Sharma : హిట్ మ్యాన్ రికార్డు బద్ధలు.. ఎంఎస్ ధోనీ రికార్డుపై కన్నేసిన అభిషేక్

Abhishek Sharma : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ దూసుకెళ్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే, మొదటి బంతి నుంచే విరుచుకుపడుతూ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే 35 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన అభిషేక్, టీమిండియా దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల రికార్డులకు ఎసరు పెట్టాడు. ముఖ్యంగా ఒకే ఓవర్‌లో 20 కంటే ఎక్కువ పరుగులు సాధించడంలో అభిషేక్ ఇప్పుడు ధోనీ సరసన చేరి అగ్రస్థానంలో నిలిచాడు.

ధోనీ రికార్డుకు అడుగు దూరంలో..

ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో 20 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు అత్యధిక సార్లు కొట్టిన భారతీయ బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ ఇప్పుడు టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఇప్పటివరకు ఎంఎస్ ధోనీ 10 సార్లు ఈ ఘనత సాధించగా, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌తో అభిషేక్ కూడా 10వ సారి ఈ మార్కును అందుకున్నాడు. దీనివల్ల 9 సార్లు ఈ రికార్డు సాధించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మను అభిషేక్ వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతం ధోనీ అన్‌ఫిట్ కారణంగా బెంచ్ కే పరిమితమవ్వడంతో, తర్వాతి మ్యాచ్‌ల్లో అభిషేక్ మరోసారి ఈ ఫీట్ సాధిస్తే ధోనీని వెనక్కి నెట్టి ఒంటరిగా అగ్రస్థానంలో నిలుస్తాడు.

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే అభిషేక్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. మార్కో యాన్సెన్ వేసిన ఆ ఓవర్‌లో అభిషేక్ ఏకంగా 20 పరుగులు రాబట్టాడు (ఓవర్‌లో మొత్తం 21 పరుగులు వచ్చాయి). ట్రావిస్ హెడ్ మొదటి బంతికి సింగిల్ తీయగా, స్ట్రైకింగ్‌లోకి వచ్చిన అభిషేక్ వరుసగా 6, 4, 6 బాది బౌలర్‌ను బెంబేలెత్తించాడు. ఐదో బంతి డాట్ అయినప్పటికీ, ఆఖరి బంతికి ఫోర్ కొట్టి ఓవర్‌ను ఘనంగా ముగించాడు. ఈ వీరవిహారంతోనే రోహిత్ శర్మ రికార్డు బద్ధలైంది.

ఒకే ఓవర్‌లో 20+ పరుగులు చేసిన టాప్ భారతీయులు:

10 సార్లు – ఎంఎస్ ధోనీ

10 సార్లు – అభిషేక్ శర్మ

09 సార్లు – రోహిత్ శర్మ

08 సార్లు – రిషబ్ పంత్

07 సార్లు – హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్

టేబుల్ టాపర్‌గా హైదరాబాద్

అభిషేక్ శర్మ (35), హెన్రిక్ క్లాసెన్ (69), ఇషాన్ కిషన్ (55)ల మెరుపు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో కూపర్ కానోలీ (107 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాటర్ల సహకారం లేకపోవడంతో పంజాబ్ 202 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, శివాంగ్ కుమార్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ 33 పరుగుల విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..