Reading Time: 2 minutes
Telangana: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై రేషన్ షాపుల్లో తక్కువ ధరకే అవి పంపిణీ..

రాష్ట్రంలో పెరుగుతున్న జొన్న, మొక్కజొన్న పంటలకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే జొన్నలు, మొక్కజొన్నలను భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరలకు పంపిణీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోంది. అయితే ఈ ప్రక్రియలో మధ్యవర్తులు, దళారులు భారీ లాభాలు పొందుతున్నారనే అభిప్రాయంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. వేలం ప్రక్రియలో అవకతవకలకు అడ్డుకట్ట వేసి నేరుగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం స్వయంగా మార్క్‌ఫెడ్ ద్వారా పంట కొనుగోలు చేయాలని, ఆ ధాన్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు తక్కువ ధరకు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరానికి మించిన నిల్వలు మిగిలితే మాత్రమే వేలం వేయాలని సూచించారు.

రాష్ట్రంలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. ఈ యాసంగిలో సుమారు 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండగా, జొన్న పంట 4 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే మార్కెట్లో రైతులకు సరైన ధర లభించడం లేదని ప్రభుత్వం గుర్తించింది. మద్దతు ధర కంటే చాలా తక్కువకు వ్యాపారులు పంట కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినా, మార్కెట్లో రైతులకు రూ.1700 నుంచి రూ.1800 మాత్రమే లభిస్తోంది. జొన్నల విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైతులను దళారుల దోపిడీ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానం అమలు చేయాలని నిర్ణయించింది.

కొనుగోలు చేసిన జొన్నలు, మొక్కజొన్నలను శుభ్రపరచి, ప్యాకింగ్ చేసి నేరుగా ప్రజలకు సరఫరా చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువకు ఈ పౌష్టికాహారం అందుబాటులోకి తీసుకురావాలని మంత్రులు ఆదేశించారు. ఈ నిర్ణయంతో సాధారణ ప్రజలతో పాటు గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్లకు జొన్న, మొక్కజొన్న ఆధారిత ఆహారాన్ని సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ రంగానికి ఊరట కల్పించేందుకు కూడా ప్రభుత్వం యోచిస్తోంది. మార్కెట్ ధర కంటే తక్కువకు పౌల్ట్రీ రైతులకు మక్కలను సరఫరా చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.