Reading Time: 2 minutes
గూడు కట్టే ఏకైక పాము.. రైతులకు సాయం చేసే అసలైన కాపరి! ఎదురుపడిందంటే..

ఈ భూమిలో ఎన్నో వేల రకాల పాము జాతులు ఉన్నాయి. వాటిలో మనకు కొన్ని మాత్రమే తెలుసు.. ఇక వాటి జీవన శైలి, వేటాడే విధానం పూర్తిగా తెలియదు.. కానీ, ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందినవి కింగ్‌ కోబ్రాలు అని మీకు తెలుసా..? అవును.. గిరి నాగులు పిలిచే కింగ్‌ కోబ్రాలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అగ్రగామిగా నిలుస్తున్నాయి. ఎందుకంటే, గిరినాగులు అగ్రస్థాయి వేటాడే జీవులు (Apex Predators). వీటి ఆహారం ప్రధానంగా ఇతర పాములు. నాగుపాములు, కట్లపాములు వంటి విషపూరిత పాములను ఇవి ఆహారంగా తీసుకోవడం ద్వారా, జనావాసాల్లో పాముల జనాభా పెరగకుండా నియంత్రిస్తాయి. తద్వారా మానవులకు, పాములకు మధ్య జరిగే ఘర్షణలను పరోక్షంగా తగ్గిస్తాయి. గిరినాగులు ఉన్న అడవి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క అంటున్నారు పర్యావరణ వేత్తలు.

ఇకపోతే, ఈ కింగ్‌కోబ్రాలకు ఉన్న అత్యంత అరుదైన లక్షణం గూడు కట్టుకునే అలవాటు.. అవును.. గిరినాగులు గూడు కట్టుకుని గుడ్లు పెట్టే ఏకైక పాము జాతి. ఇవి గుడ్లు పెట్టేందుకు దిబ్బల మాదిరిగా నేలపై గూళ్లు కడతాయి. ఇందుకోసం ఆడ కింగ్‌ కోబ్రా గర్భం దాల్చిన వెంటనే ఎండిపోయిన వెదురు ఆకులను సేకరించి గూట్లో గుడ్లు పెట్టేందుకు అనువుగా సర్దుతుంది. అందులో 30 నుంచి 40 గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో నెల నుంచి నెలన్నర పాటు ఆహారం మానేసి గూట్లోనే ఉండిపోతుంది. ఆ తరు­వాత 15 నుంచి 30 రోజుల్లో గుడ్ల నుంచి పిల్ల­లు వస్తాయనగా తల్లిపాము గూడు విడిచి వెళ్లిపోతుంది. పిల్లలు పుట్టగానే వాటిని ఆహారంగా తీసుకోకూడదనే సహజ సిద్ధమైన ప్రవృత్తి దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ, తల్లి గిరినాగు లేని సమయంలో ఆ గూళ్లను అడవి పందులు, ముంగిసలు ఇతర జంతువులు తవ్వి గుడ్లను తినేస్తాయి. ఫలితంగా కింగ్‌ కోబ్రాల జాతి అంతరించిపోయే స్థితికి చేరుకుంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో తూర్పు కనుమల ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ (EGWS) , అటవీ శాఖతో కలిసి గిరినాగుల మనుగడ కోసం పోరాడుతోంది. వీటి గూళ్లను గుర్తించి, ఇతర జంతువుల నుండి రక్షణ కల్పించడానికి దోమతెరలు, ప్రత్యేక రక్షణ కవచాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వన్యప్రాణి సొసైటీ వీటి సంరక్షణకు నడుం బిగించింది. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో సుమారు 30కి పైగా గిరినాగు పిల్లలను పొదిగించి, క్షేమంగా అడవుల్లోకి విడిచిపెట్టారు. గతంలో గిరినాగులు కనిపిస్తే భయంతో చంపేసే గిరిజన ప్రాంత ప్రజల్లో ఇప్పుడు మార్పు వచ్చింది. అవి కనిపిస్తే వెంటనే సంరక్షణ బృందాలకు సమాచారం అందించేలా శిక్షణ ఇచ్చారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..