
ఎండాకాలంలో చాలా మంది ప్రత్యేక స్నాక్స్ తీసుకుంటారు.. శరీరాన్ని కూల్ చేసే పదార్థాలను తీసుకుంటారు. అయితే.. అలాంటి బలమైన ఆహార పదార్థాల్లో కమ్మని బెల్లం సున్నుండలు ఒకటి.. వీటిలోని పోషకాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. అమ్మమ్మల కాలం నాటి కమ్మని పిండివంటల రుచి చూస్తే.. వారెవ్వా అనాల్సిందే.. ముఖ్యంగా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ బలవర్ధకమైన బెల్లం సున్నుండలను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పండుగ రోజుల్లో లేదా ఇంట్లో ఎప్పుడైనా తయారు చేసుకోదగిన ఈ సంప్రదాయ వంటకాన్ని బెల్లం, మినుములతో సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఈ సంప్రదాయ వంటకం పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం…
కావలసిన పదార్థాలు:
* మినపగుళ్ళు: 1 1/2 కప్పులు
* పొట్టు మినుములు: 1/2 కప్పు (మొత్తం సుమారు 1/2 కిలో)
* బెల్లం: 1 1/2 నుండి 2 కప్పులు (రుచికి తగ్గట్టుగా, సుమారు 400 గ్రాములు నుండి 1/2 కిలో)
* నెయ్యి: 3/4 కప్పు
* బియ్యం: 2 టేబుల్‌స్పూన్లు
* యాలకులు: 5-6
తయారీ విధానం:
మినుములు వేయించడం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో లేదా పాన్‌లో 1 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు పొట్టు మినుములను తీసుకోండి. మంటను మధ్యస్థంగా (మీడియం ఫ్లేమ్) పెట్టి, మినుములు లోపలి వరకు బాగా వేగే వరకు సుమారు 10-12 నిమిషాలు నిరంతరం కలుపుతూ వేయించండి. ఇవి చక్కగా వేగినప్పుడు కమ్మని వాసన వస్తుంది. రంగు కూడా ఎరుపులోకి మారుతుంది. ఓపికగా వేయించడం ద్వారా లడ్డూలు మంచి రుచిని పొందుతాయి.
బియ్యం కలిపి వేయించడం: మినుములు బాగా వేగాక, అందులోకి రెండు టేబుల్‌స్పూన్ల బియ్యాన్ని కలపండి. బియ్యం వేయడం వల్ల సున్నుండలు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉంటాయి. బియ్యం కలిపిన తర్వాత మరో ఒకటి రెండు నిమిషాలు వేయించండి. బియ్యం రంగు మారి, ట్రాన్స్‌పరెంట్ గా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మినుములను ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి.
పప్పును గ్రైండ్ చేయడం: మినుములు పూర్తిగా చల్లారిన తర్వాత, వాటిని చిన్న మిక్సీ గిన్నెలో కొద్దికొద్దిగా తీసుకుంటూ గ్రైండ్ చేయండి. పెద్ద మిక్సీ గిన్నెలో ఒకేసారి గ్రైండ్ చేస్తే పప్పు సరిగా నలగదు. పప్పును వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి. అయితే లడ్డూలు తినేటప్పుడు రుచిగా ఉండటానికి కొద్దిగా బరకగా ఉంచుకోవడం మంచిది. మంచి ఫ్లేవర్ కోసం పప్పు గ్రైండ్ చేసేటప్పుడే 5-6 యాలకులను కూడా వేసి మెత్తగా రుబ్బండి.
బెల్లం కలపడం: పప్పు అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత, అందులోకి 1 1/2 నుండి 2 కప్పుల బెల్లం తీసుకోండి. తీపిని బట్టి బెల్లం పరిమాణాన్ని మార్చుకోవచ్చు. 1/2 కిలో పప్పుకి 400 గ్రాముల బెల్లం సరిపోతుంది. మరింత తీపి కావాలనుకుంటే 1/2 కిలో బెల్లం కూడా వాడుకోవచ్చు. బెల్లాన్ని పిండిలో కలిపి, మళ్ళీ కొద్దికొద్దిగా మిక్సీ గిన్నెలోకి తీసుకుంటూ బెల్లం పిండిలో పూర్తిగా కలిసిపోయేలా మెత్తగా గ్రైండ్ చేయండి.
లడ్డూలు చుట్టడం: చివరిగా, లడ్డూలు చుట్టడానికి నెయ్యిని సిద్ధం చేసుకోవాలి. మనం ఏ కప్పుతో పప్పును కొలిచామో, అదే కప్పుతో 3/4 కప్పు నెయ్యిని ఒక గిన్నెలోకి తీసుకుని కరిగించి, గోరువెచ్చగా ఉండేలా వేడి చేయండి. పిండిలోకి మొత్తం నెయ్యిని ఒకేసారి కలపకుండా, కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ, దానికి సరిపడా నెయ్యిని కలుపుతూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఈ పద్ధతిలో నెయ్యి తక్కువగా పడుతుంది మరియు లడ్డూలు చక్కగా వస్తాయి. మొత్తం పిండికి నెయ్యిని కలుపుకుంటూ సున్నుండలను తయారు చేసుకోవాలి.
ఇలా సులభమైన పద్ధతిలో కమ్మనైన బెల్లం సున్నుండలు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇవి అచ్చం అమ్మమ్మలు చేసి పెట్టిన రుచిని కలిగి ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..