Reading Time: 2 minutes
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఏంటో తెలుసా..!

జీవితం ఎంత సత్యమో, మరణం కూడా అంతే అనివార్యం. అయితే మనకు అత్యంత ప్రియమైన వారు, ముఖ్యంగా వృద్ధులు మరణానికి దగ్గరవుతున్నప్పుడు ఆ విషయాన్ని అంగీకరించడం కష్టతరమైన పని. కానీ ప్రకృతి సిద్ధంగా శరీరం ఇచ్చే కొన్ని సూచనలను గమనించడం వల్ల, వారికి నొప్పీ, ఆందోళన లేని ప్రశాంతమైన అంతిమ ప్రయాణాన్ని సిద్ధం చేయవచ్చు. మరణానికి కొన్ని రోజుల ముందు నుండే శరీరం తన కార్యకలాపాలను నెమ్మదిగా చేస్తుంది. శరీరం శక్తిని పొదుపు చేసుకోవడం ప్రారంభిస్తుంది. దీనివల్ల ఆహారం, నీటిపై ఆసక్తి పూర్తిగా తగ్గుతుంది. బలవంతంగా తినిపిస్తే అది వారికి శ్వాస ఇబ్బందిని లేదా వాంతులను కలిగించవచ్చు.

ఈ మార్పులు గమనించాలి

నిద్ర – స్పృహ తప్పడం: వారు రోజులో 20 గంటలకు పైగా నిద్రపోవచ్చు. బాహ్య ప్రపంచంతో సంబంధం తగ్గుతుంది. పిలిచినా పలకని స్థితిలోకి వెళ్లవచ్చు.

శ్వాసలో మార్పు: మరణం సమీపించే కొద్దీ శ్వాస తీసుకునే విధానం మారుతుంది. దీన్ని వైద్య పరిభాషలో చైన్-స్టోక్స్ శ్వాస అంటారు. అంటే కొద్దిసేపు వేగంగా శ్వాస తీసుకుని, ఆపై కొన్ని సెకన్ల పాటు శ్వాస ఆగిపోతుంది. గొంతు కండరాలు సడలడం వల్ల వచ్చే శబ్దాన్ని డెత్ రాటిల్ అంటారు.

చర్మంపై రంగు మార్పులు: రక్త ప్రసరణ గుండె మరియు మెదడుకు మాత్రమే పరిమితం కావడంతో, చేతులు, కాళ్లు చల్లబడిపోతాయి. చర్మంపై నీలి రంగు లేదా ఊదా రంగు మచ్చలు కనిపిస్తాయి.

మానసిక – భావోద్వేగ సంకేతాలు

మరణం దరిచేరుతున్న వారు కేవలం శారీరకంగానే కాకుండా మానసిక మార్పులకు కూడా లోనవుతారు.

భ్రమలు – దర్శనాలు: కొందరు వ్యక్తులు చనిపోయిన తమ బంధువులతో మాట్లాడుతున్నట్లు లేదా వారు తమను పిలుస్తున్నట్లు చెబుతుంటారు. దీన్ని కొందరు భ్రమ అనుకుంటారు, కానీ ఇది వారి ప్రయాణంలో ఒక భాగమని శాస్త్రవేత్తలు భావిస్తారు.

అశాంతి: కొంతమంది అకస్మాత్తుగా చేతులు విసురుతూ, బట్టలు లాగుతూ అసహనంగా కనిపిస్తారు. ఇది శరీరంలో జరుగుతున్న రసాయనిక మార్పుల వల్ల కలగవచ్చు.

ఆఖరి క్షణాల్లో కుటుంబసభ్యులు ఏం చేయాలి..?

ఈ సమయం చాలా సున్నితమైనది. వారికి వైద్యం కంటే ఆత్మీయత ఎక్కువగా అవసరం. పంచేంద్రియాలలో చివరి వరకు పనిచేసేది వినికిడి శక్తి మాత్రమే అని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి వారు స్పృహలో లేకపోయినా వారి చెంత కూర్చుని ప్రేమగా మాట్లాడండి. పాత జ్ఞాపకాలను గుర్తు చేయండి. మీరు మాకు చాలా ముఖ్యం, మేము జాగ్రత్తగా ఉంటాం అనే భరోసానివ్వండి.

సౌకర్యాన్ని కల్పించడం:

  • గదిలో గాలి వెలుతురు ఉండేలా చూడండి.
  • పెదవులు ఆరిపోకుండా తడి గుడ్డతో తుడుస్తూ ఉండండి.
  • కంటి చుక్కల మందు వేస్తూ కళ్లు ఆరిపోకుండా చూడండి.
  • వారికి ఇష్టమైన దైవ ప్రార్థనలు లేదా ప్రశాంతమైన సంగీతాన్ని వినిపించండి.

ప్రశాంతత: గదిలో ఎక్కువగా జనం ఉండటం, గొడవ చేయడం లేదా ఏడవడం వంటివి వారిని ఆందోళనకు గురిచేస్తాయి. వీలైనంత నిశ్శబ్దంగా ఉండటం మంచిది.

మరణానంతర గౌరవం

ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం ముఖ్యం. వారి కళ్లు మూయడం, శరీరాన్ని సరిగ్గా ఉంచడం, వారి సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలకు సిద్ధం చేయడం కుటుంబ సభ్యుల బాధ్యత. మరణాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు, కానీ ఆ మరణాన్ని గౌరవప్రదంగా, ప్రశాంతంగా మార్చడం మన చేతుల్లోనే ఉంది.