Reading Time: < 1 minute
ఉరుసు ఉత్సవాల్లో తీరని విషాదం.. కళ్లముందే నీటమునిగి తల్లీబిడ్డల దుర్మరణం!

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గుడికల్ గ్రామంలో గురువారం నాడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ గుడికల్ దర్గా ఉరుసు ఉత్సవాల వేళ, సంతోషంగా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఒక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాకు చెందిన రజియా బేగం, తన ఏడేళ్ల కుమార్తె అఫ్రిన్ సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉరుసు వేడుకల కోసం గుడికల్ చేరుకున్నారు. దర్గా దర్శనానికి వెళ్లే ముందు, కాలకృత్యాలు తీర్చుకుని కాళ్లు చేతులు కడుక్కునేందుకు వారు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. అయితే, చెరువులోకి దిగిన క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి తల్లి రజియా బేగం, చిన్నారి అఫ్రిన్ ఒక్కసారిగా లోతైన నీటిలోకి వెళ్లిపోయారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి నీటిలోకి దూకారు. తల్లి రజియా బేగంను క్షేమంగా ఒడ్డుకు చేర్చి ప్రాణాలతో కాపాడగలిగారు. కానీ, చిన్నారి అఫ్రిన్ మాత్రం నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

కళ్లముందే బిడ్డ నీటిలో మునిగిపోవడంతో తల్లిదండ్రుల ఆక్రందనలు మిన్నంటాయి. భక్తులతో కళకళలాడాల్సిన ఉరుసు ప్రాంగణం, ఈ ప్రమాదంతో ఒక్కసారిగా మూగబోయింది. ఈ ఘటన స్థానికంగానూ, ఉత్సవాలకు వచ్చిన భక్తుల్లోనూ తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటపై కేసు నమోదు చేసిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..