Reading Time: 2 minutes
Vaibhav Suryavanshi : కెమెరా సాక్షిగా చేతులు జోడించి సారీ చెప్పిన వైభవ్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో మరోసారి సంచలనం నమోదైంది. చిన్న వయసులోనే భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తో స్టేడియాన్ని షేక్ చేసేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన రెండో సెంచరీని నమోదు చేశాడు. అయితే ఇంతటి భారీ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత వైభవ్ కెమెరా సాక్షిగా తన తండ్రికి చేతులు జోడించి సారీ చెప్పడం ఇప్పుడు అందరి మనసు గెలుచుకుంటోంది. ఈ ఆసక్తికరమైన ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఐపీఎల్‌లో మోస్ట్ డేంజరస్ బ్యాటర్‌గా మారిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వైభవ్, అదే ఊపుతో 36 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక భారతీయుడు సాధించిన అత్యంత వేగవంతమైన సెంచరీగా ఇది నిలిచింది. గత సీజన్‌లో 35 బంతుల్లోనే సెంచరీ కొట్టి రికార్డు సృష్టించిన వైభవ్, ఇప్పుడు మరోసారి అలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఒక వీడియోను షేర్ చేసింది. అందులో టీమ్ మేనేజర్ రోమీ భిందర్ వైభవ్‌తో సరదాగా ముచ్చటించారు. “నీ బ్యాటింగ్ చూసి మీ నాన్న చాలా గర్వంగా ఉన్నారు కానీ.. అవుట్ అయిన తర్వాత నువ్వు గ్రౌండ్ లో ఉన్న కోచ్‌ల కాళ్లు ఎందుకు మొక్కలేదు అని అడుగుతున్నారు” అని భిందర్ చెప్పారు. దీనికి వైభవ్ స్పందిస్తూ.. “అవుట్ అయిన తర్వాత చాలా మంది సీనియర్లు అక్కడ ఉన్నారు.. ఆ సమయంలో ఆలోచనల్లో ఉండి కోచ్‌లకు నమస్కరించడం మర్చిపోయాను. నాన్న ఫోన్ చేస్తే దీని గురించి కచ్చితంగా 10 నిమిషాలు క్లాస్ పీకుతారు. అందుకే ముందే సారీ చెబుతున్నాను” అంటూ కెమెరా ముందు చేతులు జోడించి క్షమాపణ కోరాడు.

ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వైభవ్ కండరాల నొప్పితో బాధపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో ఒక్కసారిగా కాలి కండరం పట్టేయడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీనిపై వైభవ్ స్పందిస్తూ.. “గత మ్యాచ్‌లో చీలమండకు దెబ్బ తగిలింది. దాని వల్ల కాలిపై ఒత్తిడి పడి హ్యామ్‌స్ట్రింగ్ గాయమైంది. ప్రస్తుతం ఫిజియోల పర్యవేక్షణలో ఉన్నాను. కోలుకుంటున్నాను.. వచ్చే మ్యాచ్ నాటికి కచ్చితంగా ఫిట్ అవుతాను” అని అభిమానులకు భరోసా ఇచ్చాడు.

చాలా చిన్న వయస్సులోనే ఐపీఎల్ వంటి పెద్ద వేదికపై తన ముద్ర వేస్తున్న వైభవ్ సూర్యవంశీ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. బ్యాటింగ్‌లో దూకుడు, బయట వినయం కలగలిసిన ఈ కుర్రాడు భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానే కూడా వైభవ్ ఆడిన ఇన్నింగ్స్‌ను కొనియాడారు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా మైదానంలో అతను చూపిస్తున్న క్రమశిక్షణ అందరికీ ఆదర్శమని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి