సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి కారణంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన విషయం తెలిసిందే. గత ఏడాది కాలంగా గాయంతో బాధపడుతున్న కమిన్స్, యాషెస్ సిరీస్ తో పాటు టీ20 ప్రపంచకప్ కూడా ఆడలేదు. దీంతో ఈ సీజన్ ఆరంభంలోనే సన్‌రైజర్స్ యాజమాన్యం నాయకత్వ బాధ్యతలను యువ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అప్పగించింది.
ప్రపంచకప్‌లో భారత జట్టు తరపున అద్భుత ప్రదర్శన కనబరిచి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న జార్ఖండ్ ఆటగాడు ఇషాన్.. కమిన్స్ లాంటి దిగ్గజ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేసే అతి పెద్ద బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. అనుభవలేమి ఉన్నప్పటికీ బలమైన జట్టును ముందుండి నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు.
కెప్టెన్‌గా జట్టును బాగానే నడిపిస్తున్నప్పటికీ, ఇషాన్ కిషన్‌ను అదృష్టం ఏమాత్రం వరించడం లేదు. తాజా సీజన్లో ఆడిన 6 మ్యాచ్‌లలోనూ అతనికి టాస్ కలిసిరాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఆరో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోవడంతో ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఒక కెప్టెన్‌గా తన తొలి 6 మ్యాచ్‌లలో వరుసగా 6సార్లు టాస్ ఓడిపోయిన ఏకైక నాయకుడిగా ఇషాన్ కిషన్ నిలిచాడు. నాణేన్ని గాల్లోకి ఎగరేసిన ప్రతిసారీ ఫలితం ప్రత్యర్థి కెప్టెన్లకే అనుకూలంగా రావడం గమనార్హం.
కొత్త కెప్టెన్ నేతృత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో మిశ్రమ ఫలితాలను చవిచూస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ మ్యాచ్‌లో ఇషాన్ అద్భుతంగా ఆడినప్పటికీ, ప్రత్యర్థి కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించి తిరిగి పుంజుకుంది. హైదరాబాద్.
తదుపరి మ్యాచ్ లలో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో వరుసగా ఓడిపోయి తడబడింది. అయితే ఐదో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై ఏకపక్ష విజయం సాధించి తిరిగి గెలుపు బాట పట్టింది. చెన్నైతో మ్యాచ్‌కు ముందు వరకు ఇషాన్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 విజయాలు, 3 అపజయాలతో నిలిచింది. టాస్ పదే పదే ఓడిపోతున్నా కెప్టెన్‌గా అతని వ్యూహాలు బాగానే ఉన్నాయని క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.




