Reading Time: < 1 minute
ఒక బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు.! హైదరాబాద్ ఊపిరి పీల్చుకో.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసిన ఉత్సాహంలో ఉండగా, ఈ నెల 18న ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టుకు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు బయటకు వచ్చాయి. బ్యాడ్ న్యూస్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో కుడి చేతికి గాయం కావడంతో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి రావడం ఆరెంజ్ ఆర్మీకి గట్టి ఎదురుదెబ్బే. అయితే అతడి స్థానంలో యాజమాన్యం శ్రీలంక యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్సాన్ మధుశంకను రూ. 75 లక్షలకు జట్టులోకి తీసుకుంది.

స్వింగ్ బౌలింగ్‌లో ఆరితేరిన మధుశంక చేరికతో బౌలింగ్ విభాగం బలోపేతం కానుంది. మరోవైపు, ఫిట్‌నెస్ సమస్యలతో ఫస్ట్ హాఫ్ మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి రానుండటం అభిమానులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకుని, ఈ నెల 25న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్.. మరికొద్ది రోజుల్లోనే కమిన్స్ నాయకత్వంలో మధుశంక లాంటి అనుభవజ్ఞులైన బౌలర్ల తోడవ్వడంతో మున్ముందు కూడా ఐపీఎల్‌లో అదే జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది చదవండి: హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు మాత్రం అస్సలు చేయకండి..