
ఒకనాడు స్వయంపాలన, హక్కుల పోరాటాలకు వేదికైన తెలంగాణ నేడు నిశ్శబ్దంగా ఒక సామాజిక విపత్తు వైపు అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని సగటు యువకుడి నుంచి నగరాల్లోని కార్పొరేట్ విద్యాసంస్థల విద్యార్థుల వరకు మత్తు పదార్థాల కౌగిట్లోకి జారుకుంటున్నారు. ఒకప్పుడు మత్తు పదార్థాల సమస్య గురించి మాట్లాడితే పంజాబ్ పేరు వినిపించేది. నేడు అదే చర్చలో తెలంగాణ పేరు కూడా వినిపించడం ఆందోళన కలిగించే విషయం.
గత దశాబ్దంలో తెలంగాణ అభివృద్ధి, ఐటీ, పారిశ్రామికీకరణ, పట్టణీకరణలో వేగంగా ముందుకు వెళ్లింది. కానీ అదే సమయంలో మరో నిశ్శబ్ద సంక్షోభం సమాజాన్ని లోపల నుంచి తినేస్తోంది. అదే మద్యం, గంజాయి, సింథటిక్ డ్రగ్స్, మత్తు మాత్రలు, ఇతర వ్యసనాల విస్తరణ.
సౌత్‌లో తెలంగాణ టాప్
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, ఎయిమ్స్ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేల ప్రకారం దేశంలో మత్తు పదార్థాల వినియోగం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ఓపియాడ్స్ వినియోగంలో పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు, గోవా, ఢిల్లీ ముందంజలో ఉండగా… గంజాయి, మద్యం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంల్లో ఉంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ గణాంకాల ప్రకారం తెలంగాణలో 43 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. ఇది జాతీయ సగటు కంటే రెండింతలకు పైగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యం వినియోగిస్తున్నారు. దీంతో తెలంగాణ దేశంలో అత్యధిక మద్యం వినియోగ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆందోళనకర విషయం ఏమిటంటే చాలామంది యువకులు 20 ఏళ్లలోపే మత్తు పదార్థాల బారిన పడుతున్నారు. డ్రగ్స్ వేల మందిని ప్రభావితం చేస్తే, మద్యం లక్షల కుటుంబాలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తోంది. అధికారిక నివేదికల ప్రకారం ఒకే సంవత్సరంలో యువతలో డ్రగ్ వినియోగం 39 శాతం వరకు పెరిగింది. 2024లో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితి తెలంగాణకు స్పష్టమైన హెచ్చరిక. ఇప్పుడే కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు, చికిత్స సదుపాయాలు విస్తరించకపోతే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
ఫ్యాషన్ కాదు, ఒక వ్యాధి
సమాజం వ్యసనాన్ని ఒక ‘క్యారెక్టర్ లోపం’ లేదా ‘ఫ్యాషన్’గా చూస్తోంది. కానీ ఒక సైకియాట్రిస్ట్‌గా నేను చెప్పేది ఏంటంటే, వ్యసనం అనేది ఒక క్రానిక్ బ్రెయిన్ డిసీజ్ (దీర్ఘకాలిక మెదడు వ్యాధి). డోపమైన్ హైజాక్ – మన మెదడులో ‘రివార్డ్ పాత్‌వే’ ఉంటుంది. మనం మంచి ఆహారం తిన్నా, విజయం సాధించినా డోపమైన్ అనే రసాయనం విడుదలై ఆనందాన్ని ఇస్తుంది. కానీ డ్రగ్స్ వాడినప్పుడు సహజంగా విడుదలయ్యే డోపమైన్ కంటే 10 రెట్లు ఎక్కువ కెమికల్ ఒకేసారి విడుదలవుతుంది. మెదడు ఈ కృత్రిమ ఆనందానికి అలవాటు పడి, ఆ డ్రగ్ లేకపోతే ‘అన్‌హ్యాపీ’ స్టేజ్‌కి వెళ్ళిపోతుంది. దీనినే డిపెండెన్స్ అంటారు. ఈ రోజుల్లో డ్రగ్స్ లేదా ఆల్కహాల్ సేవించడం ఒక ‘స్టేటస్ సింబల్’గా, ఫ్యాషన్‌గా యువత భావిస్తోంది. దీనికి తోడు తల్లిదండ్రుల మితిమీరిన అంచనాలు, చదువుల ఒత్తిడి, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేని ఒంటరితనం యువతను మత్తువైపు నెడుతున్నాయి. ఈనాటి వేగవంతమైన జీవితంలో తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఇస్తున్నారు కానీ సమయాన్ని ఇవ్వడం లేదు.
గోవా, ముంబై, బెంగళూరు, పొరుగు రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు సరిహద్దుల వద్ద స్కానర్లు, స్నిఫర్ డాగ్స్‌తో కూడిన శాశ్వత చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి. వ్యసనాల సమస్య కేవలం చట్టం, శిక్షల అంశం కాదు. వందల కేసులు నమోదు చేయవచ్చు, వేల మందిని అరెస్టు చేయవచ్చు. కానీ వ్యసనాలకు దారితీసే కారణాలను మార్చకపోతే సమస్య మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటుంది. అందుకే ఈ యుద్ధం పోలీస్ స్టేషన్‌లో కాదు, కుటుంబంలో ప్రారంభం కావాలి. వైద్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం, మీడియా, సమాజం కలిసి బాధ్యత తీసుకోవాలి.
పరిష్కార మార్గాలు
మత్తు పదార్థాలు కేవలం ఒక వ్యక్తిని కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజ భవిష్యత్తును దెబ్బతీస్తాయి. ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే సాంకేతికంగా అభివృద్ధి చెందినా, మానసికంగా బలహీనమైన తరం ఏర్పడే ప్రమాదం ఉంది. వ్యసన నిర్మూలనకు ట్రిపుల్- ఏ మోడల్ అమలు చేయాలి. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ వల్ల మెదడుపై పడే ప్రభావాన్ని న్యూరోసైన్స్ ఆధారంగా విద్యార్థులకు వివరించాలి. శాస్త్రీయ అవగాహన కల్పించాలి. ప్రతి విద్యాసంస్థలో మనో వైద్య నిపుణుల సేవలు అందుబాటులో ఉండాలి. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను ప్రారంభ దశలోనే గుర్తించి సహాయం అందించాలి. వ్యసనపరులను నేరస్థులుగా కాకుండా రోగులుగా చూడాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలి. పరిసరాల్లో పొగాకు, సిగరెట్ విక్రయాలపై కఠిన నియంత్రణ అవసరం. డ్రగ్స్ కేసుల్లో నిందితులు సులభంగా బెయిల్‌పై బయటకు రాకుండా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. డ్రగ్ పెడ్లర్లకు కఠిన శిక్షలు అమలు చేసేలా చట్టాలను మరింత బలోపేతం చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక ప్రభుత్వ డీ-అడిక్షన్, రిహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
గతం కంటే బెటర్. కానీ..
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సీవీ ఆనంద్ వంటి సమర్థ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో డ్రగ్స్ మహమ్మారి తీవ్రతను గుర్తించి, దానిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకోవడం శుభపరిణామం. ఈగల్ ఫోర్స్ (ఈగల్ ఎలైట్యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్)కు పూర్తి స్వేచ్ఛ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడం ద్వారా అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియా నెట్‌వర్క్‌లపై గట్టి చర్యలు ప్రారంభమయ్యాయి. నైజీరియన్ ముఠాలు, పెద్ద సరఫరాదారులను పట్టుకోవడంలో, పబ్‌లు, రేవ్ పార్టీలపై దాడులు నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం విజయాలు సాధించింది. అయితే తెలంగాణ ‘మరో పంజాబ్’ కాకుండా ఉండాలంటే ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలి.
– డా. బి. కేశవులు
ఎండీ, సీనియర్ మానసిక
వైద్య నిపుణుడు