Reading Time: < 1 minute
Kesineni Nani Slams Kesineni Chinni Pittala Dora Stop Spreading Stories Amid Vijayawada Political Row

Kesineni Nani Slams Kesineni Chinni: విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎంపీ కేశినేని చిన్ని చేసిన ఆరోపణలకు మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. బ్యాంకుల నుంచి రూ.120 కోట్ల రుణం తీసుకుని స్కాం చేశారని చిన్ని చేసిన వ్యాఖ్యలను నాని తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందేశంలో కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాన్నా పిట్టల దొరా.. ప్రెస్‌మీట్ పెట్టి పిట్టకథలు బాగా చెప్పావు. అది నీకు వెన్నతో పెట్టిన విద్య కదా’ అంటూ వ్యాఖ్యానించారు. తన అప్పులు, ఆస్తులు, ఆదాయం, బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు, తాను ఉపయోగించే కార్లు, తన జీవనశైలి గురించి చిన్ని మాట్లాడారని పేర్కొన్నారు.

అయితే ప్రజలు తనను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్న విషయాన్ని ఎంపీ చిన్ని మరిచిపోయినట్లు ఉందని కేశినేని నాని ఎద్దేవా చేశారు. ‘నువ్వు ఢిల్లీలో పేకాడుకునే బదులు నా మీద ప్రధానమంత్రి, హోంమంత్రి లేదా ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేయవచ్చు. వారు దగ్గరకు రానీయకపోతే పార్లమెంట్‌లో నా గురించి మాట్లాడి నీ ఆవేదన వ్యక్తం చేయవచ్చు’ అని సూచించారు. అంతేకాకుండా తనపై అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిజంగా ఆధారాలు ఉంటే సీబీఐ లేదా ఈడీకి ఫిర్యాదు చేసి విచారణ చేయించాలని సవాల్ విసిరారు. ‘నన్ను జైలుకు పంపించవచ్చు, నా ఆస్తులు జప్తు చేయించవచ్చు, వేలం వేయించి ప్రజలకు పంచిపెట్టవచ్చు’ అని నాని వ్యాఖ్యానించారు.

అలాంటి చర్యలు ఏవీ తీసుకోకుండా కేవలం ప్రెస్‌మీట్లు పెట్టి, తనకు అనుకూల మీడియా ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం వల్ల ప్రజలు నమ్మరని కేశినేని నాని అన్నారు. ఈ సందర్భంగా చిన్ని పేరును ప్రస్తావిస్తూ.. ‘మై డియర్ చార్లెస్ శోభరాజ్’ అంటూ సెటైర్ వేశారు. ఇటీవల కేశినేని చిన్ని చేసిన ఆరోపణలు, వాటికి నాని ఇచ్చిన సమాధానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.