
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదరిందని.. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని ఆదేశించానన్నారు. సుంకం లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందన్నారు. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయాలని ట్రంప్ పోస్ట్ పెట్టారు. శాంతి ఒప్పందానికి సహకరించిన వారికి ట్రంప్ అభినందనలు తెలిపారు. పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో మొత్తానికి ఈ ఒప్పందం కుదిరింది. యురేనియం సహా మరికొన్ని విషయాల్లో ఇరాన్ వైఖరిపై ట్రంప్ అసంతృప్తిగానే ఉన్నా ప్రసుత్తానికైతే మెజార్టీ అంశాలపై ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధిని తక్షణమే పూర్తిగా తెరిచేందుకు ఆదేశాలు జారీ చేసిన ట్రంప్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఇరాన్ తీరంలో అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని తక్షణమే ఎత్తివేస్తూ ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పారు. “ప్రపంచంలోని ఓడలన్నింటికీ ఉన్న ఇంజన్లు స్టార్ట్ చేయండి.. చమురు ప్రవాహాన్ని సాగనివ్వండి” అంటూ ట్రంప్ తన సోషల్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ‘లెట్ ది ఆయిల్ ఫ్లో’ అంటూ ట్రంప్ ఇలా అధికారిక ప్రకటన చేసాక అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. దాదాపు 4 శాతం మేర దిగొచ్చాయి.
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో పతనమైన చమురు ధరలు
బ్రెంట్ క్రూడ్.. బ్యారెల్‌కు దాదాపు 84 డాలర్లకు ధర పడిపోయింది. హర్మూజ్ జలసంధి నుంచి ఇక స్వేచ్ఛగా చమురు రవాణా జరగనుంది. యుద్ధం ఆగడంతో స్టాక్‌మార్కెట్లలో ఫుల్ జోష్ కనిపించనుంది. హర్మూజ్ పూర్తిగా తెరుచుకుంటుందనే ప్రకటనతో నెమ్మదిగా పరిస్థితులు నార్మల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే బాటలో డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్.. బ్యారెల్‌కు సుమారు 80 డాలర్లకు రేటు చేరింది. అమెరికా – ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక డీల్ కారణంగా గ్లోబల్ మార్కెట్ సమీకరణాలు ఒక్కసారిగా మారనున్నాయి. డీల్ సంతకాల తర్వాత క్రూడాయిల్ ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా ప్రకటనపై ఇరాన్ ఏమన్నదంటే..
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగించేందుకు MoU ఖరారైందని ఇరాన్ కూడా తెలిపింది. పాకిస్తాన్ జరిపిన చర్చల ఫలితంగా ఇది కుదిరిందని పేర్కొంది. ఇప్పటి నుంచే అన్ని ఫ్రంట్‌లలో సైనిక చర్యలు శాశ్వతంగా ఆపేస్తున్నట్టు ఇరాన్ స్పష్టం చేసింది. అటు.. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కూడా ఉద్రిక్తతలకు బ్రేక్ పడుతుందని పేర్కొంది.
జూన్ 14న ట్రంప్ పుట్టినరోజు.. ఈ కారణంగానే డీల్ ఫైనల్ అయినా సంతకాలు చేసేందుకు ఇరాన్ ముందుకు రాలేదనే వాదనలూ వినిపిస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..