
దేశీయ స్టాక్ మార్కెట్ వరసగా మూడో రోజు కూడా లాభాల బాట పట్టింది. గ్లోబల్ మార్కెట్లు డల్‌గా ఉన్నా.. ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG) షేర్ల పుణ్యమా అని రాకెట్‌లా దూసుకెళ్లింది. ఈరోజు మంగళవారం (జూన్ 16) బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 544.15 పాయింట్లు (0.71%) ఎగబాకి.. 76,808.48 పాయింట్ల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 135.25 పాయింట్లు (0.57%) లాభపడి, 23,989.15 మార్కును దాటేసింది. వరుసగా మూడు రోజులు మార్కెట్ ఇలా లాభాల్లో ముగియడంతో ఇన్వెస్టర్ల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
భారత మార్కెట్ ఇంతలా ఊపందుకోవడానికి దేశంలోని కొన్ని దిగ్గజ కంపెనీలు వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్ (HUL), అలాగే పవర్ సెక్టార్ దిగ్గజం ఎన్‌టీపీసీ (NTPC) షేర్లు ఏకంగా 2% చొప్పున లాభపడి మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఐటీ (IT) రంగం అత్యధికంగా లాభపడిన రంగంగా నిలిచింది. వీటితో పాటు మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, FMCG రంగాలు కూడా మార్కెట్‌కు మంచి బూస్ట్ ఇచ్చాయి.
►ALSO READ | E20 పెట్రోల్ వాడితే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయా? ICICI ఏమంటోందంటే..
మార్కెట్ మొత్తం లాభాల్లో ఉన్న.. కొన్ని రంగాలు మాత్రం కాస్త నిరాశపరిచాయి. మెటల్స్, హెల్త్‌కేర్, సిమెంట్, ఫార్మా రంగాల్లో నేడు అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో నష్టాల్లో ముగిశాయి.
ఆసియా మార్కెట్లలో జపాన్‌కు చెందిన ‘టోపిక్స్’ సూచీ 0.2% పడిపోగా, హాంగ్‌కాంగ్‌కు చెందిన ‘హాంగ్ సెంగ్’ ఏకంగా 1.2% నష్టపోయింది. ఆస్ట్రేలియా, షాంఘై, అలాగే అమెరికాకు చెందిన S&P 500 ఫ్యూచర్స్ యథాతథంగా నిలిచాయి. యూరప్ మార్కెట్లు కూడా స్థిరంగా ఉన్నాయి.